Ram Temple: దేశవ్యాప్తంగా అంతా రామమందిర ప్రారంభోత్సవంపైనే చర్చ నడుస్తోంది. హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్య రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగబోతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన పలువురు గర్భిణి మహిళల నుంచి అక్కడి వైద్యులకు విచిత్రమైన అభ్యర్థన ఎదురవుతోంది. రామాలయ ప్రారంభోత్సవం జరిగే జనవరి 22న తమ బిడ్డలకు జన్మనివ్వాలని తల్లులు భావిస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ కోసం అక్కడి వైద్యులను కోరుతున్నారు. రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుకలు జరిగే జనవరి 22ను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. అలాంటి రోజే తమ పిల్లలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. నివేదికల ప్రకారం, ఆసుపత్రులలో చేరిన గర్భిణీ రోగులు తమ ప్రసవాలను జనవరి 22 వరకు వాయిదా వేయాలని వైద్యులను కోరుతున్నారు. కొందరు నెలలు నిండకముందే బిడ్డలకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. తమకు పుట్టే పిల్లలకు రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు యూపీ తల్లులు.
రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆహ్వానాలను పంపింది ఆలయ ట్రస్టు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రులు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, సాధువులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 16 నుంచి ప్రారంభమై జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలతో ముగుస్తుంది. అయోధ్యలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో అయోధ్యలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సమాచారం. భారీ వేడుకలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది.