Yash Reveals: బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏకంగా రూ.4,000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న రాకింగ్ స్టార్ యశ్.. తాజాగా చిత్ర బడ్జెట్‌పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్‌ను హోస్ట్.. రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ స్కేల్ గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన యశ్.. రూ.4,000 కోట్లు కేవలం సినిమా నిర్మాణ వ్యయం మాత్రమే కాదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది ఒక అపోహ. అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రూ.4,000 కోట్లు రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ మొత్తం ప్రాజెక్ట్‌కు సంబంధించిన బడ్జెట్. ఇందులో సినిమా నిర్మాణంతో పాటు రిలీజ్, ప్రమోషన్స్ ఖర్చులు కూడా ఉన్నాయి” అని యశ్ వివరించారు. హాలీవుడ్ సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి బడ్జెట్‌ను లెక్కించారని యశ్ తెలిపారు. గ్లోబల్ స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్‌కు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తే ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుందని పేర్కొన్నారు. సినిమా అనేది భారత్‌కు సాఫ్ట్ పవర్లాంటిదని యశ్ అభిప్రాయపడ్డారు. ఇండియన్ సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కష్టపడాలని అన్నారు. ‘రామాయణ’, ‘టాక్సిక్’ వంటి చిత్రాలు భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని పేర్కొన్నారు. ఇక ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా.. యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

