ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ‘జ్యాపి స్టూడియోస్’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్, సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనిల్ రావిపూడి ‘జ్యాపి స్టూడియోస్’ బ్యానర్, పోస్టర్ ని లాంచ్ చేశారు. ‘జ్యాపి స్టూడియోస్’ లాంచ్ ఈవెంట్ లో మొత్తం నాలుగు చిత్రాలను ప్రకటించారు నిర్మాతలు. విశేషం ఏమంటే… ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి.
జ్యాపి స్టూడియోస్ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ లో వున్న ‘జగమేమాయ’ పోస్టర్ ని నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం ‘పతంగ్’ పోస్టర్ ని దర్శకుడు అనుదీప్ ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన మూడో సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. అలానే సుహాస్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకాబోతున్న ప్రొడక్షన్ నెం. 4 పోస్టర్ ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్ లో రాజ్ తరుణ్, సుహాస్, ధన్య బాలకృష్ణ, చైతన్య, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ, ”ప్రస్తుతం పరిశ్రమలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు మారడం అంత సులభం కాదు. చిత్ర నిర్మాణం అంటే ఒక సవాల్ గా మారిన పరిస్థితి. ఇవాళ ఆడియన్స్ కి చాలా కంటెంట్ అవసరం వుంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇండస్ట్రీని అవగాహన చేసుకున్నాం. సినిమాలు డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. తర్వాత యూట్యూబ్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశాం. ఫైనల్ గా మన కోసం మనమే కంటెంట్ ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించాం. సంజీవ్ రెడ్డి, నాని బండ్రెడ్డి , డైరెక్టర్ ఆదినారాయణ, చైతన్య, ఆర్కే వీళ్ళంతా మా ప్రయాణంలో తోడుగా నిలబడ్డారు. ప్రేక్షకులందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను” అన్నారు.
సుహాస్ మాట్లాడుతూ.. ఈ బ్యానర్ లో ఓ ఫాంటసీ డ్రామా చేస్తున్నాని తెలిపాడు. ధన్య బాలకృష్ణ తాను నటిస్తున్న ‘జగమే మాయ’ చిత్రం గురించి చెబుతూ, ”ఈ ప్రాజెక్ట్ కోసం ఉదయ్ గారు నన్ను ఎంతగానో నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం వుంది. సినిమా నిర్మాణంలో ఉదయ్ గారి అద్భుతంగా ఈ మూవీ తీస్తున్నారు. మనిషి వ్యక్తిత్వాన్ని ‘జగమేమాయ’ లో చాలా విలక్షణంగా ఆవిష్కరించారు” అని వివరించింది. ‘పతంగ్’ దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ, ”ఇదో ఫన్ రోమ్ కామ్. చాలా వైబ్రెంట్ గా వుంటుంది. కైట్ ఫ్లయింగ్ పోటీల నేపధ్యంలో ఈ సినిమా వుంటుంది. ఇండియాలో ఇలాంటి కథతో వస్తున్న సినిమా ఇదే మొదటిది. మూవీ చాలా ఫ్రెష్ గా వుంటుంది” అని అన్నారు.