తెలుగు సినిమా రచయిత సత్యానంద్ ను చూడగానే, ఆయన ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. అతిగా మాట్లాడరు. కానీ, ఆయన మాటలు మాత్రం జనం నోట చిందులు వేసేలా చేస్తుంటారు. చిత్రసీమలో ఎంతోమందికి సన్నిహితులు సత్యానంద్. ఎవరినీ నొప్పించరు. తన దరికి చేరిన అవకాశాలతో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సత్యానంద్ మాటల తూటాలు అంతగా పేల్చడం లేదు. కానీ, ఆయన కథలతో మాత్రం చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకప్పుడు సత్యానంద్ రచన అనేది తెలుగు సినిమాకు ఓ సెంటిమెంట్ గా ఉండేది. సత్యానంద్ మాటలతో రూపొందిన చిత్రాలకు మార్కెట్ కూడా అలాగే ఉండడం విశేషం!
సత్యానంద్ పుస్తకాల పురుగు. ఇప్పటికీ ఏదో ఒక పుస్తకం పట్టుకొని కనిపిస్తారు. బాగా రాయాలంటే బాగా చదవాలి అనే మాటను తు.చ. తప్పక పాటిస్తారు. అందుకే కొందరు దర్శకులు సత్యానంద్ మాటల కోసం పరుగులు తీసేవారు. ఆయన కల్పించిన కథలకూ ప్రాధాన్యమిచ్చేవారు. ఆదుర్తి సుబ్బారావుకు కావలసిన వారు కావడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు సత్యానంద్. ప్రతిభంటూ లేకపోతే, ఎవరూ ఇక్కడ రాణించలేరు. ఆదుర్తి ఓ చిన్న కథను సత్యానంద్ కు ఇచ్చి , దానిని పెద్దగా మార్చమన్నారు. తక్కువ సమయంలోనే ఓ నవలగా ఆ కథను మలిచారు సత్యానంద్. అతనిపై గురి కుదరడంతో తాను తెరకెక్కించిన ‘మాయదారి మల్లిగాడు’ సినిమా ద్వారా రచయితగా సత్యానంద్ ను పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘జ్యోతి’కి, ఎ.మోహన్ గాంధీ తొలి చిత్రం ‘అర్ధాంగి’కి, ఆ రోజుల్లో సంచలన చిత్రంగా నిలచిన ‘కలియుగ స్త్రీ’కి సత్యానంద్ రచన ఆకట్టుకుంది. యన్టీఆర్ నటించిన ‘ఎదురీత’ హిందీ చిత్రం ‘అమానుష్’ రీమేక్. దానికి సైతం సత్యానంద్ తెలుగుదనం అద్ది సంభాషణలు పలికించారు. సత్యానంద్ చిత్రసీమలో అడుగు పెట్టిన కొద్ది రోజులకే జంధ్యాల కూడా కాలుమోపారు. జంధ్యాల- సత్యానంద్ మధ్య స్నేహబంధం కుదిరింది. ఇద్దరూ కలసి కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చారు. ఓ సినిమాకు సత్యానంద్ మాటలు పలికిస్తే, మరో సినిమాకు జంధ్యాల సంభాషణలు రాసేవారు. జంధ్యాల దర్శకుడైన తరువాత స్టార్ డైరెక్టర్స్ అందరూ సత్యానంద్ సంభాషణలకే ప్రాధాన్యమిచ్చారు. యన్టీఆర్ సూపర్ హిట్ మూవీస్ ‘గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి’కి సత్యానంద్ రాసిన సంభాషణలు ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించాయి. దాంతో స్టార్ హీరోస్ అందరూ సత్యానంద్ రచనకే ఓటు వేశారు.
ప్రస్తుతం టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు హీరోలుగా నటించిన తొలి చిత్రాలకు సత్యానంద్ రచన చేయడం విశేషం. ఈ ముగ్గురు హీరోలు ఈ నాటికీ స్టార్ డమ్ చూస్తూ సాగుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతుంటారు సత్యానంద్. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తెరకెక్కిన ‘ఝాన్సీ రాణి’ చిత్రానికి సత్యానంద్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా అంతగా అలరించలేదు. దాంతో రచనకే పరిమితం అయ్యారు సత్యానంద్. ఇప్పటికీ ఎంతోమంది పేరున్న దర్శకులు తమకు ఏదైనా సందేహం కలిగితే, ఈ సీనియర్ రైటర్ సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. తెలుగు చిత్రసీమలో సత్యానంద్ మార్క్ డైలాగులు, వాటిలోని పవర్ తెలియాలంటే ఆయన రచన చేసిన చిత్రాలు చూస్తే చాలు. నవతరం రచయితలు తప్పకుండా సత్యానంద్ చిత్రాలను అధ్యయనం చేస్తే, తమకంటూ ఓ స్థానం కల్పించుకోగలరని చెప్పవచ్చు.