తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. ‘విట్ నెస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రానికి సంబంధించి మే డే శుభాకాంక్షలు తో విడుదల చేసిన ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే డ్రైనేజ్ పిట్ నుంచి సాయం కోరుతున్నట్లుగా ఒక చెయ్యి కనిపించడం పోస్టర్ లో చూడొచ్చు.
నటిగా శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘యూ టర్న్’, ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’, ‘విక్రమ్ వేద’ వంటి సినిమాలతో సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘విట్ నెస్’లో ఆర్కిటెక్ట్‌గా కనిపించనున్న శ్రద్ధా శ్రీనాథ్ ఓ మంచి ఆశయం కోసం పోరాడే పాత్రాలో కనిపించనుంది. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణితో పాటు ఈ చిత్రంలో షణ్ముగరాజా, జి. సెల్వ, రాబర్ట్, రాజీవ్ ఆనంద్, ఎం.ఏ.కె.రామ్ కూడా నటిస్తున్నారు. టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ తమిళమణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ‘విట్ నెస్’ చిత్రంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్ లో అడుగుపెడుతుండటం విశేషం.