Unni Mukundan: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘మాలికాపురం’ సినిమాను ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఇది జనం ముందుకు రాబోతోంది. ఈ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుండి చిత్రసీమలో ఓ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది. ఆ తర్వాత సరిగ్గా పది రోజులకు అల్లు అరవింద్ కన్నడలో అప్పటికే సూపర్ హిట్ అయిన ‘కాంతార’ను తెలుగులో విడుదల చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ జనవరి 13వ తేదీ విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఎనిమిది రోజులకు అల్లు అరవింద్ మలయాళంలో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న ‘మాలికాపురం’ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు చిరంజీవి సినిమా వెనుకే వచ్చిన ‘కాంతార’ విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ వెనకే వస్తున్న ‘మాలిక పురం’ కూడా తెలుగులో సక్సెస్ అవుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. విశేషం ఏమంటే… ‘కాంతార’ విడుదల సమయానికి రిషబ్ శెట్టి గురించి తెలుగువారికి పెద్దంత తెలియదు. కానీ ‘మాలికాపురం’లో నటించిన ఉన్ని ముకుందన్ ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ’తో పాటు తాజాగా విడుదలై, విజయం సాధించిన ‘యశోద’తో తెలుగువారికి సుపరిచితుడే. ఇదిలా ఉంటే… ‘కాంతార’ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినట్టుగానే, ‘మాలికాపురం’ సైతం పల్లెటూరు నేపథ్యంలోనే రూపుదిద్దుకుంది. అందులో దైవాంశ సంభూతులు తెర మీద కనిపించినట్టుగానే, ఈ సినిమాలోనూ కొన్ని పాత్రలకు సూపర్ పవర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి మాసమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది కాబట్టి, సరిగ్గా సమయం చూసి… అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారని, అది విజయానికి దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.