Balagam: బాలనటిగా పలు చిత్రాలలో నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకుంది కావ్య కళ్యాణ్ రామ్. ఈ తేనె కళ్ళ సోయగం… ఇప్పుడు హీరోయిన్ మారిపోయింది. గత యేడాది నవంబర్ లో విడుదలైన ‘మసూద’లో కీలకపాత్ర పోషించి మెప్పించింది. అంతేకాదు… ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చక్కని విజయాన్ని అందుకోవడంతో… తొలి సినిమాతోనే విజయాన్ని కావ్య తన కిట్ లో వేసుకున్నట్టు అయ్యింది. విశేషం ఏమంటే… ఈ యేడాది మార్చి 3న విడుదలైన వేణు ‘బలగం’ మూవీలోనూ కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించింది. ‘దిల్’ రాజు సమర్పణలో వచ్చిన ఈ సినిమా కూడా విజయం సాధించింది. దాంతో హీరోయిన్ గా కావ్య వరుసగా రెండు విజయాలను సాధించినట్టు అయ్యింది. ప్రస్తుతం అమ్మడు కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్’ మూవీలో నాయికగా చేస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘మత్తు వదలరా’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహకు ఆ తర్వాత ఆశించిన స్థాయి దక్కలేదు. ఒకవేళ ‘ఉస్తాద్’ హిట్ అయితే… అతనితో పాటు కావ్యకూ మంచి పేరొస్తుంది. అంతేకాదు… హాట్రిక్ సక్సెస్ అందుకున్న నాయికగా గుర్తింపూ లభిస్తుంది. మరి ‘ఉస్తాద్’ కావ్య కెరీర్ కు ఏ మేరకు ఉపయోగపడతాడో చూడాలి.