బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ. ఎంట్రీ ఇచ్చినపుడు సన్నీ టాప్ 5 వరకూ చేరుకుంటాడని గానీ, టైటిల్ గెలుస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు. అయితే తన ఆటతీరుతో పాటు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ తో వారం వారానికి స్ట్రాంగ్ అవుతూ టాప్ 5 చేరుకోవడమే కాదు ఏకంగా టైటిల్ కూడా ఎగరేసుకుపోయాడు. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి మోడల్ గా, టీవీ యాక్టర్ గా మారి సినిమాలోనూ మెయిన్ లీడ్ చేసిన సన్నీకి బిగ్ బాస్ విజేత అనే ట్యాగ్ ఎంత వరకూ కలసి వస్తుందన్నది చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ వన్ విజేత శివబాలాజీ. నిజానికి బిగ్ బాస్ కంటే ముందు తను హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఆ ఇమేజ్ అతడికి బిగ్ బాస్ టైటిల్ గెలవటానికి కూడా ఉపయోగపడింది. అయితే విజేతగా నిలిచిన తర్వాత అది అతగాడి కెరీర్ కి ఉపయోగపడిందా? అంటే లేదనే చెప్పాలి. బిగ్ బాస్ విన్నర్ అనే ట్యాగ్ తనకి కొత్తగా ఎలాంటి ఆఫర్లను తెచ్చిపెట్టకపోగా ఉన్న ఇమేజ్ ని కూడా దూరం చేసింది. తను సొంతంగా ఛానెల్ పెట్టుకుని అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు సాగుతున్నాడు శివబాలాజీ.
ఇక బిగ్ బాస్ 2 విజేత కౌశల్. నిజానికి అనూహ్యంగా టైటిల్ గెలిచిన పోటీదారు ఇతను. ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా టైటిల్ విన్నర్ గా నిలిచాడు కౌశల్. అయితే విజేతగా నిలిచిన కౌశల్ ని ఆఫర్లు ఏవీ వెతుక్కుంటూ రాలేదు. తనే వాటిని వెతుక్కుంటున్నాడని చెప్పాలి. సో బిగ్ బాస్ ఇమేజ్ విజేతగా నిలిచిన కొంత కాలమే పని చేసింది.
బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ని రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. రాములమ్మ శ్రీముఖితో పోటీపడి టైటిల్ కొట్టుకు పోయినా రాహుల్ కి అంతగా ఒరిగింది ఏమీ లేదు. దానికి ముందు కూడా రాహుల్ సింగింగ్ తో బిజీగా ఉన్నాడు. టైటిల్ గెలిచాడని ఎవరూ పిలిచి పాటలు ఇవ్వలేదు. తన గాత్రాన్ని ఇష్టపడ్డ వారు మాత్రమే పిలిచి అవకాశాలు ఇచ్చారు. సో ఇతగాడి వ్యవహారంలోనూ బిగ్ బాస్ విజేత ప్రభావం శూన్యం.
ఇక సీజన్ 4 విషయానికి వస్తే ఆరంభం నుంచి అంచనాల మేరకు రాణించి టైటిల్ గెలిచింది అభిజిత్ ఒక్కడే అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన అభిజిత్ విజేతగా ఎదిగిన తర్వాత సందడే చేయలేదు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమాలో హీరోగా నటించాడు. అది ఇంకా రిలీజ్ కాలేదు. ఇటీవల కాలంలోఇతగాడి ఊసే వినిపించటం లేదు.
సన్నీ విషయానికి వస్తే బిగ్ బాస్ టైటిల్ ట్యాగ్ ఎంత వరకూ ఉపయోగపడుతుందనేది నిర్ణయించటానికి కొంత టైమ్ పడుతుంది. అయితే అవకాశాలను ఆబగా అందిపుచ్చుకోవడంలో దిట్ట సన్నీ. జర్నలిజం నుంచి టీవీ రంగం వైపు ఫాస్ట్ గా అడుగులు వేసిన సన్నీ… అక్కడ సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘సకలగుణాభిరామ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. విజేతగా బయటకు రాగానే ఈ సినిమా నుంచి పాటను రిలీజ్ చేశారు. అయితే స్లోగా ఉన్న ఈ పాట అంతగా ఆకట్టుకోలేపోతోంది. టైటిల్ విన్నర్ నటించిన సినిమాలో పాట అనే ఆసక్తితో వింటున్నారు. సినిమా విడుదలై హిట్ అయితే తప్ప సన్నీ సినిమాల్లో షైన్ అయ్యే మార్గాలు తెరుచుకుంటాయి. లేదంటే మిగతా విజేతల లెక్కలో బ్యాక్ టు రొటీన్ వర్క్ అనిపించక మానదు. మరి సన్నీ షైన్ అవుతాడా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.