హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ను ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన ఘటన వదిలేలా కన్పించడం లేదు. విల్ తనకు చేసిన పనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో వేదికపైనే హాలీవుడ్ హాస్యనటుడు క్రిస్ రాక్ చెంప పగల గొట్టాడు. విల్ భార్య జాడా అలోపేసియా అనే జుట్టు రాలే వ్యాధితో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె గుండుపై ఆస్కార్ వేడుకల్లో క్రిస్ కామెడీ చేయడం ఈ అనూహ్య పరిణామానికి దారి తీసింది. క్రిస్ కామెంట్ చేయడం, జాడా బాధ పడడం, విల్ వెంటనే వెళ్లి వేదికపైనే క్రిస్ చెంప పగల గొట్టడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఇక ఆ తరువాత గంటల వ్యవధిలోనే విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ ను అందుకోవడం జరిగిపోయింది. తరువాత వివాదం మొదలైంది. విల్ పై ఎలాంటి ఆరోపణలు చేయడానికి క్రిస్ ఇష్టపడలేదు. కానీ ఆయన సోదరుడు మాత్రం ఓ స్టాండ్ అప్ కామెడీ షోలో ఫైర్ అయ్యారు. ఇక కొంతమంది విల్ కి సపోర్ట్ చేస్తే, మరికొంత మంది క్రిస్ కి సపోర్ట్ చేశారు. మరి అలాంటి వేదికపై వ్యాధితో బాధ పడుతున్న తన భార్యపై కామెంట్స్ చేస్తే ఎవరైనా ఊరుకుంటారా ? అంటూ విల్ అభిమానులు వెనకేసుకొచ్చారు. ఏదేమైనా అంత పెద్ద వేదికపై విల్ ఇలాంటి చర్యకు పాల్పడడం చాలామందికి మింగుడు పడలేదు.
Read Also : Abhishek Agarwal : పవన్ తో “ది కాశ్మీర్ ఫైల్స్” ప్రొడ్యూసర్
మరోవైపు దీనిపై అకాడమీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఆస్కార్ ను వెనక్కి తీసుకుంటుందని కూడా అన్నారు. కానీ ఎట్టకేలకు ఆస్కార్ అకాడమీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల పాటు విల్ స్మిత్ ను ఆస్కార్ అవార్డులకు రావొద్దని బ్యాన్ విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆస్కార్స్- అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ & సైన్సెస్ నిర్వాహకులు శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు అక్కడ జరిగిన ఈ పరిణామానికి క్షమాపణలు చెప్పారు.
మార్చి 27న 2022 ఆస్కార్స్‌లో క్రిస్ ను కొట్టిన విల్ ఆ తరువాత తాను చేసిన చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. అకాడమీ మార్చి 30న అధికారిక క్రమశిక్షణా చర్యలను ప్రారంభించింది. శుక్రవారం అంటే ఏప్రిల్ 8న ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. సమావేశం వాస్తవానికి ఏప్రిల్ 18న జరగాల్సి ఉంది, అయితే విల్ ఏప్రిల్ 1న అకాడమీకి రాజీనామా చేసిన తర్వాత, అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ సమావేశాన్ని శుక్రవారానికి మార్చారు. మొత్తానికి స్మిత్ ఏ అకాడమీ ఈవెంట్‌లు లేదా ప్రోగ్రామ్‌లకు వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా హాజరు కాకుండా పదేళ్లు బ్యాన్ విధించడం ఆయనకే కాదు, అభిమానులకు కూడా షాక్ ఇచ్చే విషయమని చెప్పాలి. విల్ పై తీసుకున్న నిర్ణయంతో ఆస్కార్స్ వేదికపై ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు ఎవరైనా ఒకసారి ఆలోచించుకోవాలి అనే హెచ్చరికను అకాడమీ జారీ చేసినట్టు అయ్యింది.