ఈ మధ్యకాలంలో అంటే ప్యాండమిక్ తరువాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తగ్గించేశారు అని ఆ మధ్య భలేగా టముకు సాగింది. అయితే వారికి నచ్చిన, వారిని మెప్పించిన చిత్రాలకు మాత్రం జనం భలేగా పరుగులు తీశారు. ఈ తీరును గమనిస్తే లాక్ డౌన్స్ తరువాత కొన్ని చిత్రాలనే ప్రేక్షకులు ఆదరించారని తెలుస్తోంది. చిత్రమేమంటే, తెలుగు సినిమాలో అంతకు ముందు కొన్ని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ భలేగా మురిపించాయి. కానీ, కరోనా కల్లోలం తరువాత ఏ ఒక్క స్త్రీ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రమూ జనాన్ని ఆకర్షించ లేదు. ఆకట్టుకోక పోవడానికి కథల్లో పట్టు లేకపోవడమే కారణమని అంటున్నారు సినీజనం. తాజాగా విడుదలైన ‘విరాటపర్వం’లో పేరుకు రాణా వంటి నోటెడ్ హీరో ఉన్నప్పటికీ, ఇది నక్సలైట్ తూము సరళ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ‘విరాటపర్వం’లోని ప్రధాన కథ అంతా సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కానీ, జనాన్ని ఎందుకనో ఈ సినిమా అలరించలేక పోయింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జయమ్మ పంచాయితీ’ పంచాయతీ అన్నదే లేకుండా మొదటి ఆటకే చాప చుట్టేసింది.
ఈ సినిమాలే కాదు, అనుష్క నటించి, ఓటీటీలో నేరుగా విడుదలైన ‘నిశ్శబ్దం’ టైటిల్ కు తగ్గట్టుగానే నిశ్శబ్దంగా సాగింది. నిజానికి ‘అరుంధతి’ చిత్రంతో మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు క్రేజ్ సంపాదించి పెట్టిన అనుష్క, ఆ తరువాత కూడా “రుద్రమదేవి, భాగమతి” వంటి చిత్రాలలో నటించింది. ఇక ‘మహానటి’తో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచిన కీర్తి సురేశ్ తోనూ “మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ” వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కాయి. అవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఒకప్పుడు తనదైన అభినయంతో జనాన్ని ఎంతగానో అలరించిన ఆమనితోనూ ‘అమ్మ దీవెన’ అనే స్త్రీ ప్రధానాంశ చిత్రం రూపొందింది. ఆ సినిమా ఫలితమూ అంతే! ఆ రోజుల్లో ‘అంకురం’తో విశేషాదరణ చూరగొన్న దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ఆ సినిమా నాయిక రేవతి ప్రధాన పాత్రలోనే ‘ఇట్లు అమ్మ’ రూపొందించారు. ఈ అమ్మను కూడా జనం ఆదరించలేకపోయారు. యాంకర్ గా అదరహో అనిపించిన అనసూయతో తెరకెక్కిన ‘థ్యాంక్యూ బ్రదర్’ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఈ తరం ముద్దుగుమ్మల్లో ఒకరైన నిత్య మీనన్ నటించడమే కాదు, చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొనీ ‘స్కైలాబ్’ నిర్మించింది. ఆ ల్యాబ్ సైతం లాభాలు చూడలేకపోయింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో మురిపించిన శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘గమనం’ కూడా సరైన గమ్యం చేరుకోలేదు. దిశా ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆశా ఎన్ కౌంటర్’ ఏ మాత్రం అలరించలేదు. తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా జనాన్ని ఆకట్టుకోవడం ఇంపాజిబుల్ అని తెలుసుకుంది. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొంది, నేరుగా ఓటీటీలో వెలుగు చూసిన ‘భామాకలాపం’ కూడా సందడి చేయలేకపోయింది. నందితాశ్వేత ప్రధాన పాత్రలో రూపొందిన ‘అక్షర’ పరిస్థితీ అంతే! తాజాగా ‘విరాటపర్వం’ చూసిన తరువాత జనం ఎందుకని ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్’ వైపు మొగ్గు చూపడం లేదన్న ఆసక్తికరమైన చర్చ మొదలయింది. స్త్రీ ప్రధాన పాత్రతో రూపొందే చిత్రాలలో నవతరం ప్రేక్షకులను అలరించడానికి ఏ యే అంశాలను చొప్పించాలో ముందు దర్శకనిర్మాతలు అధ్యయనం చేయాలి. ఆ తరువాతే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు దృష్టి సారించాలి. మరి ఏ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెలుగువారిని మళ్ళీ ఆకట్టుకొని ముందుగా బాక్సాఫీస్ ను కొల్లగొడుతుందో చూడాలి.