బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల హవా చాలా పెరిగింది, ఇప్పుడు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు కూడా బౌండరీలు దాటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, యష్, రిషబ్ శెట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, కార్తీ, సూర్య, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్, విక్రమ్ లాంటి హీరోలు తమ సినిమాల కోసం రాష్ట్రాలు దాటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లి మరీ తమ సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమా బాగుంటుంది, తప్పకుండ చూడండి, ఆదరించండి అంటూ స్పెషల్ మీడియా ఇంటరాక్షన్స్ పెట్టి మరీ అడుగుతున్నారు. ఆ హీరోల కలెక్షన్స్ పెరగడానికి ఈ ప్రమోషన్స్ కూడా ఎంతో హెల్ప్ అవుతున్నాయి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు.
తన సినిమాలని డబ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా విజయ్ ని హైదరాబాద్ తీసుకోని రావడం లేదు. శంకర్ డైరెక్ట్ చేసిన ‘స్నేహితుడు’, మురుగదాస్ డైరెక్ట్ చేసిన ‘తుపాకీ’ సినిమాల కోసం చివరగా విజయ్ హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కసారి కూడా విజయ్ మన దగ్గర ప్రమోషన్స్ చెయ్యలేదు. చిత్ర యూనిట్ మొత్తం వచ్చినా తను మాత్రం అటెండ్ అవ్వడు. మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయినా విజయ్ ని హైదరాబాద్ రప్పిస్తాడు అనుకుంటే, వారసుడు సినిమా కోసం థియేటర్స్ కి బ్లాక్ చెయ్యడంలో బిజీగా ఉన్న దిల్ రాజు, విజయ్ ని రప్పించలేక పోయాడు. విజయ్ వస్తాడు అని దిల్ రాజు చెప్పాడు కానీ మాట వరసకి మాత్రమే, ఎప్పుడు రానీ విజయ్ వారసుడు సినిమా కోసం కూడా రాలేదు.
తన తమిళ అభిమానుల కోసం భారి ఆడియో లాంచ్ చేసి, “ఎన్ నింజిల్ కుడి ఇరుక్కుం” అంటూ స్పీచ్ ఇచ్చే విజయ్, తన తెలుగు అభిమానులకి కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. ఇక్కడ డబ్బులు కావాలి కానీ ఇక్కడ ప్రమోషన్స్ చెయ్యను అంటే ఫ్యూచర్ లో విజయ్ సినిమాల కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఉండవు. ఈ విషయం విజయ్ వీలైనంత త్వరగా అర్ధం చేసుకోని, మార్కెట్ పెంచుకోవాలి అనుకుంటే తమిళనాడు దాటి బయటకి వచ్చి సినిమాని ప్రమోట్ చెయ్యాల్సిందే అని గుర్తించాలి. విజయ్ అది చెయ్యలేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా విజయ్ ఒక రీజనల్ హీరోగానే మిగిలిపోతాడు.