క్రికెట్ లో పరుగుల వర్షం కురిపించడంలో మేటి కె.ఎల్.రాహుల్. ఇక అందాలనటి అతియాశెట్టి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి గారాలపట్టి. రాహుల్, అతియా చెట్టాపట్టాలేసుకొని చాలా రోజులుగా తిరుగుతున్నారు. తమ్ముడు అహన్ శెట్టి నటించే చిత్రోత్సవాలకు ప్రియుడు రాహుల్ తో కలసి వెళ్తోంది అతియా. దీనిని బట్టి ఇరు వైపుల వారి అనుమతి ఈ జంటకు లభించిందనీ జనం భావించారు. ఇక వారి పెళ్ళెప్పుడు అన్న ఆసక్తి చూసేవారికి కలగడం సహజమే కదా! రాహుల్, అతియా వివాహం డిసెంబర్ లో ఉంటుందని, అందుకు సునీల్ శెట్టి తగిన ఏర్పాట్లు చేస్తున్నారనీ తెలుస్తోంది.
తమ కుటుంబంలో చాలా రోజుల తరువాత జరుగుతున్న తొలి వివాహం కాబట్టి, అతియా పెళ్ళిని అత్యంత వైభవంగా చేయాలని సునీల్ శెట్టి తపిస్తున్నారట! అతియా, రాహుల్ ఇద్దరూ 1992లోనే జన్మించారు. వారిద్దరి జాతకాల దృష్ట్యా డిసెంబర్ లో వివాహం మంచిదని పండితులు సూచించారట. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ముంబయ్ లోని పేరున్న హోటల్స్, కేటరర్స్, డిజైనర్స్ ను సునీల్ శెట్టి బుక్ చేశారట. ఈ వేడుకలో బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ పాల్గొంటారనీ తెలుస్తోంది. ఇక రాహుల్ కు అత్యంత సన్నిహితులైన క్రికెటర్స్ మాత్రమే వస్తారని సమాచారం. ఇదిలా ఉంటే, అతియా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం ఈ యేడాదిలో పెళ్ళి ఉండదని చెబుతున్నారు. ఎందుకంటే, అతియా అంగీకరించిన రెండు సినిమాలు పూర్తి చేయాల్సిఉందని వారి మాట! అలాగే రాబోయే వరల్డ్ కప్ కారణంగా రాహుల్ కు కూడా ఈ యేడాది వీలు కాదని అంటున్నారు. మరి రాహుల్, అతియా కళ్యాణం ఎప్పుడు? మళ్ళీ అందరిలోనూ ఆసక్తి! ఇంతకూ ఎప్పుడో?