Karthi: కార్తికి తమిళనాటనే కాదు తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉంది. ఆరంభంలో వరుస హిట్స్ ఇచ్చిన కార్తి ఆ తర్వాత ఎక్కువగా పరాజయాలను ఎదుక్కొన్నాడు. మధ్యలో ‘ఖాకీ’, ‘ఖైదీ’ వంటి హిట్ సినిమాలు వచ్చినా ఎందుకో కార్తీ మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇక ఈ ఏడాది కార్తీ నటించిన ‘విరుమాన్’, ‘పొన్నియన్ సెల్వన్ 1’, ‘సర్దార్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిజానికి తమిళ నాట కార్తీ ఈ సినిమాలతో మంచి పేరే తెచ్చుకున్నాడు. ‘విరుమాన్’ దాదాపు 50 కోట్ల వరకూ వసూలు చేసింది.
‘సర్దార్’ వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ అయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 1’ అయితే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలేవి తెలుగులో అంతగా ఆడలేదు. ఏదో వచ్చాయి వెళ్ళాయి అంతే. తమిళనాట తమ హీరోకి 2022 బాగా కలసి వచ్చిందని కార్తీ అభిమానులు సంబర పడుతున్నారు. ఈ మూడు సినిమాలే కాకుండా కమల్ ‘విక్రమ్’ సినిమాకు తమిళంలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు కార్తీ. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సర్దార్’కి సీక్వెల్ గా ‘సర్దార్ 2’ చేయబోతున్నాడు కార్తీ. ‘పొన్నియన్ సెల్వన్ 2’ రిలీజ్ కావలసి ఉంది. ఇంకా కొత్త కమిట్ మెంట్స్ ను ప్రకటించలేదు. ఈ ఏడాది తమిళంలో తన కెరీర్ బాగున్నా.. తెలుగులో మాత్రం నిరాశాజనకంగానే సాగింది. మరి రాబోయే సినిమాలైనా బాగా ఆడి కార్తీకి తెలుగునాట పూర్వవైభవాన్ని తెచ్చిపెడతాయేమో చూడాలి.