Bollywood: ఈ సారి దీపావళి పండగ అక్టోబర్ 24న వస్తోంది. అయితే ఒక్కో రాష్ల్రంలో ఒక్కో విధంగా సెలవు ప్రకటించారు. అక్టోబర్ 25న కొందరు సెలవు తీసుకుంటున్నారు. అదో విచిత్రం కాగా, దీపావళి ముందు రోజయిన అక్టోబర్ 23న మరో విశేషం చోటు చేసుకుంది. అదేమిటంటే, ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టి20 వరల్డ్ కప్ లో అత్యంత ఆసక్తికరమైన దాయాదుల సమరం – ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందరూ ఈ విశేషాలతోనే సతమతమవుతోంటే బాలీవుడ్ స్టార్ ఖాన్స్ సల్మాన్, షారుఖ్ కూడా అభిమానులకు కనుల పండుగ చేయబోతున్నారు. వారిద్దరూ అదే రోజున తమ తాజా చిత్రాల ట్రైలర్స్ తో ఢీ కొనబోవడం విశేషంగా మారింది.
సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్?’ సినిమా ట్రైలర్ తో పలకరించనుండగా, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం ట్రైలర్ తో సందడి చేయనున్నాడు. ఈ ఇద్దరు ఖాన్స్ మధ్య ఒకప్పుడు ఎంతో అనుబంధం ఉండేది. ఒకరి చిత్రాల్లో ఒకరు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి వారి మధ్య ఆ తరువాత పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. 2006లో ఈ ఇద్దరు ఖాన్స్ బాక్సాఫీస్ వార్ లో ఢీ కొన్నారు. ఆ యేడాది కూడా ఇద్దరూ ఢీ కొన్నది అక్టోబర్ నెలలోనే కావడం విశేషం. 2006 అక్టోబర్ 20న షారుఖ్ ‘డాన్’తో సల్మాన్ ‘జాన్-ఏ-మన్’ విడుదలయ్యాయి. అమితాబ్ యాక్షన్ మూవీ ‘డాన్’ రీమేక్ గా వచ్చిన షారుఖ్ ‘డాన్’ మంచి విజయం సాధించింది. సల్మాన్ ‘జాన్-ఏ-మన్’ ఫరవాలేదనిపించింది.
తరువాతి రోజుల్లో షారుఖ్, సల్మాన్ మధ్య మనస్పర్థలు కరిగిపోయాయి. ఆ మధ్య షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే సల్మాన్ వెళ్ళి, షారుఖ్ కు నైతిక బలం అందించాడు. అలాంటి ఈ మిత్రుల మధ్య మళ్ళీ ఇన్నాళ్ళకు పోటీ చోటు చేసుకోవడం ఇరువురి అభిమానుల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది. అయితే సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్?’, షారుఖ్ ‘పఠాన్’ చిత్రాల ట్రైలర్స్ మాత్రమే పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాలు వేర్వేరు తేదీల్లో జనాన్ని పలకరించనున్నాయి. సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్?’ చిత్రం ఈ యేడాది డిసెంబర్ 30న వెలుగు చూడనుండగా, షారుఖ్ ‘పఠాన్’ 2023 జనవరి 25న జనాన్ని పలకరించనుంది. మరి ఈ టీజర్స్ తో ఈ ఇద్దరు స్టార్స్ ఎలాంటి హంగామా క్రియేట్ చేస్తారో? అదే రోజున సాగే ‘ఇండియా వర్సెస్ పాక్ క్రికెట్ మ్యాచ్’లో ఎవరు విజేతగా నిలుస్తారో? ఈ రెండు అంశాలపై జనం ఏ తరహా ఆసక్తిని ప్రదర్శిస్తారో చూడాలి.