టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరంని ‘రాజావారు రాణిగారు’ సినిమా సక్సెస్ అందరి దృష్టి పడేలా చేసింది. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ అనూహ్య విజయం ఒక్కసారిగా బిజీ హీరోని చేసింది. కరోనా తర్వాత ఒక్కసారిగా అటు ఓటీటీ ఇటు సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో బడా బడా సంస్థలు కూడా యంగ్ హీరోలను బ్లాక్ చేసే పనిలో పడ్డాయి. ఆ ప్రభావం కిరణ్ పై కూడా పడింది.
గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్, మెగా సూర్య మూవీస్ వంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ అబ్బవరంని బుక్ చేసేశాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కెరీర్ లో ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురవుతుంటాయి. కిరణ్ కి కూడా అలాగే గట్ట ఎదురు దెబ్బ తగిలింది ‘స్టెబాస్టియన్ PC 524’ రూపంలో. కిరణ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పొందింది. అయితే ఆ అపజయాన్ని ముందే ఊహించినట్లు తన తాజా చిత్రం ‘సమ్మతమే’ ప్రచారంలో తెలియచేశాడు కిరణ్. చిత్రం ఏమిటంటే శుక్రవారం జనం ముందుకు వచ్చిన
‘సమ్మతమే’ రిజల్ట్ సైతం కిరణ్ కి శరాఘాతమే. కె గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల పరాజయం కిరణ్ తదుపరి సినిమాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. నెక్ట్స్ విడుదలయ్యే కిరణ్ అబ్బవరం సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. దీని తర్వాత గీతా ఆర్ట్స్ తీస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, ఏఎం రత్నం సినిమాలు రానున్నాయి. భిన్నమైన కథాంశాలతో కూడి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడనే పేరున్న కిరణ్ రాబోయే సినిమాలతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.