VV Vinayak Wishes Geetha Movie Team: ‘కుమారి 21 ఎఫ్’తో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీలో పూర్తి భిన్నమైన పాత్రను చేసింది. అవకాశం ఇవ్వాలే కానీ నటిగా తన సత్తాను చాటుకోవాలని ఆమె తాపత్రయపడుతోందని ఆ సినిమాతో నిరూపించింది. అలానే ఇప్పుడు ‘గీత’ చిత్రంలోనూ హెబ్బా పటేల్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రను చేసింది. వి.వి. వినాయక్ శిష్యుడు విశ్వను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘గీత’ సినిమాను రాచయ్య నిర్మించారు. ఇదే నెల 14న ఇది జనం ముందుకు రాబోతున్న సందర్భంగా వినాయక్ దర్శక నిర్మాతలకు శుభాభినందనలు తెలిపారు. ‘తన శిష్యుడు, దర్శకుడు విశ్వకు మంచి పేరు; మిత్రుడు, నిర్మాత రాచయ్యకు డబ్బులు ఈ సినిమా ద్వారా రావాలని, వారి రాతలను ‘గీత’ మూవీ మార్చాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు.
హెబ్బా పటేల్ పోషించిన పాత్రను దృష్టిలో పెట్టుకునే మూవీ టైటిల్ కు ‘మ్యూట్ విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇందులో సునీల్ ఓ కీలక పాత్రను పోషించగా, సాయి కిరణ్ ప్రతినాయకుడిగా నటించాడు. ఇతర ప్రధాన పాత్రలను రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు పోషించారు. ఈ చిత్రానికి పాటలు సాగర్, స్వరాలు సుభాష్ ఆనంద్, నేపథ్య సంగీతం ఎస్. చిన్నా, యాక్షన్ కొరియోగ్రఫీ రామ్ కిషన్, సినిమాటోగ్రఫీ క్రాంతికుమార్ అందించారు.