ఇవాళ ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విశాల్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి పోస్టర్స్ ను చిత్ర దర్శక నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. అలా వచ్చిందే ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ లుక్. ఇది విశాల్ 33వ చిత్రం. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘మార్క్ ఆంటోని’ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ కు చెందిన ఎస్ వినోద్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రీతూవర్మ హీరోయిన్.
సునీల్ వర్మ, అభినయ, వైజీ మహేంద్రన్, నిళల్ గల్ రవి, కింగ్ స్లీ ఇతర కీలక పాత్రలు పోషించబోతున్నారు. సినిమాకు పెట్టింది క్రీస్టియన్ పేరు ‘మార్క్ ఆంటోని’ కాగా, తాజాగా విడుదలైన మూవీ పోస్టర్ లో విశాల్ నుదుటిన విబూతి రేకలుతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.