Virupaksha: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. నిన్నటి వరకూ ఇదే భావనలో అందరూ ఉన్నారు. అయితే… ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ ఓ నిజం బయట పెట్టాడు. ప్రస్తుతానికి ఈ సినిమా మొదట తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామని, ఇక్కడ గెలిచిన తర్వాతే రచ్చ గెలవడానికి వెళతామని స్పష్టం చేశాడు. ఇటీవల తెలుగు నుండి విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు ఇతర రాష్ట్రాలలో ఆశించిన ఫలితాలను పొందకపోవడం కూడా ఈ నిర్ణయానికి ఓ కారణం కావచ్చు.
బుధవారం మీడియాతో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ మనసులోని మాటలను పంచుకున్నాడు. ‘విరూపాక్ష’ మూవీ స్టోరీ అండ్ టైటిల్ గురించి చెబుతూ, “80, 90వ దశకంలో ఈ కథ సాగుతుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్స్ ఏమిటీ? ఊరి మీద చేతబడి చేశారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ ఇది. నేను చేతబడిని నమ్మను. కానీ ఆంజనేయుడ్ని నమ్ముతాను. ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతాను. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే ‘విరూపాక్ష’ అని టైటిల్ పెట్టాం. నేను మొదటిసారి ఇలాంటి జానర్ చేశాను. చాలామంది ఈ సినిమాను ‘కాంతార’తో పోల్చుతున్నారు. అది కల్ట్ క్లాసిక్ మూవీ. ఆ సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు” అని అన్నారు. సుకుమార్ గురించి చెబుతూ, “సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్‌గా లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూశాకా ఆడియెన్స్‌కే అర్థం అవుతుంది. నేను ఇప్పుడేం చెప్పలేను. ఇది టిపికల్ జానర్. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సినిమాకు అద్భుతంగా సెట్ అయింది. నిజానికి ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి ఏం బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యేవారు. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. నా జీవితం అన్నీ సవాళ్లతోనే నిండింది. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లని స్వీకరించేందుకు సిద్దంగానే ఉంటాను. అయినా సవాళ్లనేవి లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుంది” అని అన్నారు.
బైక్ యాక్సిడెంట్ తదనంతర పరిణామాల గురించి చెబుతూ, “ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ 36 సంవత్సరాల వయసులో నాకు మళ్లీ మాటలు నేర్పించారు. ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్న, గురువు కోసం చేయాలి. జీవితం అంటే కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. కష్టాలను, బాధలను చూసి బాధపడకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు” అని చెప్పారు.