(అక్టోబర్ 6న వినోద్ ఖన్నా జయంతి)
హిందీ చలనచిత్రసీమలో వినోద్ ఖన్నా స్థానం ప్రత్యేకమైనది. ప్రతినాయక పాత్రల్లో అడుగు పెట్టి సూపర్ స్టార్ గా అలరించిన నటుడు వినోద్ ఖన్నా. మధ్యలో ఐదేళ్ళు ‘ఓషో’ మార్గం పట్టి సినిమారంగాన్ని వీడినా, మళ్ళీ వచ్చి నటునిగా రాణించారు వినోద్ ఖన్నా. రాజకీయాల్లోనూ ప్రత్యేక బాణీ పలికించారు వినోద్. నాలుగు సార్లు ఒకే నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికై, కేంద్రమంత్రిగానూ రాణించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారాయన. వినోద్ ఖన్నా మరణానంతరం ఆయనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు.
వినోద్ ఖన్నా 1946 అక్టోబర్ 6న పెషావర్ లో జన్మించారు. ఆయన పుట్టిన కొన్ని నెలలకే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే సమయంలో భారతదేశం రెండుగా చీలింది. దాంతో పాకిస్థాన్ వదలి ఇండియా చేరుకుంది వినోద్ ఖన్నా కుటుంబం. వినోద్ ఖన్నా బాల్యం కొన్నాళ్ళు ముంబయ్ లో, తరువాత ఢిల్లీలో, ఆ పై మళ్ళీ ముంబయ్ లో సాగింది. చదువుకొనే రోజుల్లో దేవానంద్ ‘సోల్వా సాల్’, దిలీప్ కుమార్ ‘ముఘల్-ఏ-ఆజమ్’ చిత్రాలు చూసి నటనపై అభిలాష పెంచుకున్నారు వినోద్. క్రికెట్ లోనూ రాణించారు. అతని చురుకుతనం చూసి, నటుడు సునీల్ దత్ తాను నిర్మించిన ‘మన్ కా మీట్’ చిత్రంలో ప్రతినాయక పాత్రకు ఎంపిక చేసుకున్నారు. తమిళ చిత్రం ‘కుమారి పెన్’ ఆధారంగా తెరకెక్కిన ‘మన్ కా మీట్’ చిత్రానికి మన తెలుగు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు నిర్దేశకత్వం వహించారు. ఈ సినిమాలో యంగ్ విలన్ గా వినోద్ మంచి మార్కులు సంపాదించారు. దాంతో వరుసగా “పూరబ్ ఔర్ పశ్చిమ్, సచ్ఛా ఝూటా, ఆన్ మిలో సజ్నా, మేరే గావ్ మేరే దేశ్” వంటి చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరించారు వినోద్ ఖన్నా.
వినోద్ ఖన్నాకు హీరోగా గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం ‘మేరే అప్నే’. ఇందులో మరో ముఖ్యపాత్రను శత్రుఘ్న సిన్హా ధరించారు. వినోద్ ఖన్నా సోలో హీరోగా రూపొందిన ‘హమ్ తుమ్ ఔర్ వో’ మంచి ఆదరణ పొందింది. తరువాత “అచానక్, ఇంతిహా” చిత్రాలూ హీరోగా వినోద్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. రాజేశ్ ఖన్నా తరువాత సూపర్ స్టార్ స్థానం కోసం అమితాబ్ బచ్చన్ తో పోటీ పడ్డారు వినోద్ ఖన్నా. అమితాబ్ తో వినోద్ ఖన్నా కలసి నటించిన “రేష్మా ఔర్ షేరా, అమర్ అక్బర్ ఆంటోనీ, ముఖద్దర్ కా సికందర్, ఖూన్ పసీనా, పర్వరీష్, హేరా ఫేరీ” చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. అయితే అన్నిటా అమితాబ్ కే మంచి మార్కులు పడడం గమనార్హం. కానీ, రణధీర్ కపూర్ తో కలసి నటించిన “హాత్ కీ సఫాయీ, ఆఖ్రీ ఢాకూ” చిత్రాలు వినోద్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఒకానొక దశలో అమితాబ్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నారు వినోద్ ఖన్నా. అమితాబ్ కు వినోద్ గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటూ ఉండగా, 1982లో ‘ఓషో రజనీష్’ మార్గం పట్టి సినిమాలకు గుడ్ బై చెప్పారు వినోద్ ఖన్నా. ఆ సమయంలోనే అమితాబ్ బచ్చన్ తిరుగులేని సూపర్ స్టార్ గా నిలచిపోయారు. ఐదేళ్ళ తరువాత వచ్చిన వినోద్ ఖన్నా, “ఇన్సాఫ్, సత్యమేవ జయతే” చిత్రాలతో మంచి విజయం చూశారు. అయితే అంతకు ముందున్న స్టార్ డమ్ మాత్రం మళ్ళీ వినోద్ ను పలకరించలేదు. 1997లో తన తనయుడు అక్షయ్ ఖన్నాను ‘హిమాలమ్ పుత్ర్’తో హీరోగా పరిచయం చేశారు వినోద్ ఖన్నా.
అక్షయ్ ను హీరోగా పరిచయం చేసిన సమయంలోనే వినోద్ ఖన్నా భారతీయ జనతా పార్టీలో చేరి పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ నియోజక వర్గం నుండి 1997లో మొదటిసారి గెలుపొందారు. తరువాత 1999లో అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆ దఫా కేంద్రంలో తొలుత కల్చరల్ అండ్ టూరిజమ్ మంత్రిగానూ, తరువాత ఎక్సటర్నల్ అఫైర్స్ మినిస్టర్ గానూ పనిచేశారు వినోద్. అదే గురుదాస్ పూర్ నుండి 2004లోనూ విజయకేతనం ఎగురవేసి ‘హ్యాట్రిక్’ సాధించారు వినోద్. 2009లో అదే నియోజకవర్గంలో ఓటమి చవిచూసిన వినోద్ ఖన్నా, తరువాత అక్కడ నుండే 2014లో ఎమ్.పి.గా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన హిందీ నటుడు మరొకరు కానరారు. అనారోగ్య కారణంగా వినోద్ ఖన్నా 2017 ఏప్రిల్ 2న కన్నుమూశారు. వినోద్ ఖన్నా మరణానంతరం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఏది ఏమైనా హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు వినోద్ ఖన్నా.