ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అక్కడి మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖలో “రాధే శ్యామ్”తో పాటు రానున్న సినిమాలకు సంబంధించి మేయర్ ఛాంబర్‌కు ప్రతి షోకు 100 టిక్కెట్లు కేటాయించాలని అభ్యర్థించారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి నెలా మాల్స్‌లో కొత్త సినిమాలను విడుదల చేస్తున్నామని, కొత్త సినిమాలకు సినిమా టిక్కెట్లు ఏర్పాటు చేయాలని పార్టీ ప్రజాప్రతినిధులు, వార్డు కార్పొరేటర్లు కోరుతున్నారని, కాబట్టి మేయర్ ఛాంబర్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రతి షోకు 100 టికెట్లు అందించాలని ఆ లేఖలో కోరారు. అంతేకాదు అవసరమైన టిక్కెట్ ఛార్జీలు నగదు రూపంలో చెల్లిస్తామని, ఇక నుండీ ఈ విధానాన్ని అనుసరించాలి అంటూ థియేటర్ యాజమాన్యాన్ని కోరారు.
