Vijaya Shanthi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇప్పటికే ఈ సినిమాపై పలు నెగెటివ్ టాక్ నెడుతున్న విషయం విదితమే. సినిమా రిలీజ్ కాకముందే సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి తనదైన రీతిలో ఈ సినిమాను ఏకిపారేశారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడకూడదని, అమీర్ చేసిన పనికి ఇలాగే జరగాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమీర్ కు సపోర్ట్ చేసిన చిరు, నాగ్ లను కూడా పరోక్షంగా విమర్శించారు. ఇక ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో విజయ శాంతి మరోసారి తన స్పందనను తెలియజేశారు. ట్విట్టర్ లో ఆమె మాట్లాడుతూ ” మా జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదములు.. భారత్ మాతాకీ జై..భారత్ మాతాకీ జై, దేశంపై ద్వేషం. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత. హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా ఇప్పుడు కూలబడి కుదేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఆమీర్ నైజం తెలుసుకుని ఆయన సినిమాలంటే అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో గ్రహించి.. కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మీద.. విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డాడు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు. దీనంతటికీ కారణం ఒకటే.. మేకవన్నె పులిలా వ్యవహరించే ఆమీర్ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ మరియు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ.. వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు.
ఫలితంగా ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారు. పాకిస్తాన్‌కి వంత పాడుతూ.. ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమీర్ ఖాన్ సినిమా టికెట్ డబ్బుల్ని.. పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న మాలాంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారు. అంతేకాదు, తన సినిమాలు చూస్తే చూడండి, లేకుంటే లేదన్న లాల్ సింగ్ హీరోయిన్ కరీనా కపూర్ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్ధం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే.. ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఇన్ డైరెక్ట్ గా చిరుకు, నాగ్ కు కూడా విజయ శాంతి కౌంటర్ వేసినట్లే అని నెటిజన్లు అంటున్నారు.