తెలుగు తెరపై యాక్షన్ క్వీన్ అనిపించుకున్న తొలి నటి విజయలలిత. భారతీయ చలన చిత్రసీమకు ‘ఫియర్ లెస్ నాడియా’ ఎలాగో, తెలుగు తెరకు విజయలలిత అలాగా అంటూ ఆమెను అభిమానులు కీర్తించారు. నర్తకిగా, నటిగా, ఐటమ్ గాళ్ గా, వ్యాంప్ గా విభిన్నమైన పాత్రల్లో మెప్పించారు విజయలలిత. ‘లేడీ జేమ్స్ బాండ్’ అనే పేరూ సంపాదించారు. ఆమె అక్క కూతురు విజయశాంతి. ఆమె కూడా విజయలలితలాగే తన తరం హీరోయిన్స్ లో యాక్షన్ క్వీన్ గా సాగారు.
విజయలలిత 1949 జూన్ 16న జన్మించారు. బాల్యంలోనే నాట్యంలో శిక్షణ తీసుకొని, మదరాసు చేరి అక్కడ నర్తకిగా తన అదృష్టం పరీక్షించుకున్నారు. యస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ‘భీమాంజనేయ యుద్ధం’ చిత్రంలో తొలిసారి విజయలలిత నటించారు. 1966లో విడుదలైన ఈ చిత్రంలో రంభ పాత్రలో ఆమె అభినయించారు. తొలి రోజుల్లో నర్తకిగానే ఆమెకు అవకాశాలు లభించాయి. అయితే బి.విఠలాచార్య ఆమెలోని నటిని గుర్తించారు. తాను తెరకెక్కించిన అనేక జానపద చిత్రాలలో నర్తనంతో పాటు, అభినయానికీ ప్రాధాన్యమున్న పాత్రల్లో విజయలలితను నటింప చేశారు. అలా యన్టీఆర్ సరసన “చిక్కడు-దొరకడు, కదలడు-వదలడు” చిత్రాల్లో చిందేసి కనువిందు చేసిన విజయలలితకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఏయన్నార్ చిత్రాలలోనూ విజయలలిత నర్తనం నయనానందం కలిగించింది. యన్టీఆర్ కు నాయికగా ‘వేములవాడ భీమకవి’లో నటించారామె. కృష్ణ, శోభన్ బాబు, చలం, రామకృష్ణ వంటి వారితోనూ హీరోయిన్ గా జోడీ కట్టి అలరించారు.
లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్ “రౌడీ రాణి, రివాల్వర్ రాణి” వంటి చిత్రాలలో నటించి భలేగా అలరించారు. యన్టీఆర్ 200వ చిత్రంగా విడుదలైన ‘కోడలు దిద్దిన కాపురం’ చిత్రంతో పాటే విడుదలైన ‘రౌడీ రాణి’ సైతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో తొలి సినిమా స్కోప్ గా తెరకెక్కిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘ఒకనారి వంద తుపాకులు’లోనూ విజయలలిత నాయిక. తెలుగునాట ఆమెకు ఉన్న ఆదరణ చూసిన కొందరు హిందీలోనూ విజయలలితతో చిత్రాలు నిర్మించారు. మన కెఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలోనే విజయలలిత నాయికగా ‘రాణీ మేరా నామ్’ అనే హిందీ చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా చూసిన హిందీ జనం విజయలలితను మరో ‘ఫియర్ లెస్ నాడియా’ అంటూ కీర్తించారు. యన్టీఆర్ సొంత చిత్రాలలోనూ, ఆయన దర్శకత్వంలో రూపొందిన “తాతమ్మకల, శ్రీమద్విరాటపర్వము” వంటి సినిమాల్లోనూ ఆమె నటించారు. ‘సింధూరపువ్వు’లో లేడీ విలన్ గానూ, ‘సాహసవీరుడు- సాగరకన్య’లోనూ మాంత్రికురాలిగానూ విజయలలిత నటనను ఎవరూ మరచిపోలేరు. దాదాపు మూడు దశాబ్దాల తన నటజీవితంలో అన్ని భాషల్లో కలిపి 860 చిత్రాలలో విజయలలిత కనిపించారు. ఎన్ని చిత్రాల్లో నటించినా జనం మదిలో నర్తకిగానూ, ‘రౌడీ రాణి’గానూ నిలచిపోయారామె.