గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి, ఆయన మేనేజర్ జాన్సన్‌తో మహా గాంధీ అనే వ్యక్తికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన విజయ్ సేతుపతిని వదిలేలా కన్పించడం లేదు. ఇప్పటికే సేతుపతిపై పరువు నష్టం దావా వేసిన ఆ వ్యక్తి తాజాగా నటుడిపై క్రిమినల్ కేసు పెట్టారు. విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళుతున్నానని, బెంగళూరు విమానాశ్రయంలో విజయ్‌ను కలిశానని, అక్కడ తనను కొట్టారని గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also : విజయ్ సేతుపతిపై దాడిలో కొత్త ట్విస్ట్.. తన్నిన వారికి రూ.1001 రివార్డ్.. ఎప్పటివరకంటే..?
తాను కూడా నటుడే కాబట్టి విజయ్‌తో సంభాషణ ప్రారంభించేందుకు ప్రయత్నించానని గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘సూపర్ డీలక్స్’ చిత్రానికి గానూ విజయ్‌కి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించినందుకు తాను ప్రశంసించానని గాంధీ చెప్పారు. విజయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన కులాన్ని కించపరిచాడని పిటిషనర్ పేర్కొన్నారు. తనపై విజయ్, జాన్సన్ దాడి చేశారని గాంధీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, దీంతో వినికిడి సమస్య వచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా అతను విజయ్, ఆయన మేనేజర్‌పై అసలు దాడి చేయలేదని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించిందని, త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.