అణువంత అదృష్టం ఉంటే అందలాలు అవే నడచుకుంటూ వస్తాయని సినిమా సామెత. యంగ్ హీరో విజయ్ దేవరకొండను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. విజయ్ సినిమా రంగంలో రాణిస్తే చాలు అనుకొని చిత్రసీమలో అడుగు పెట్టాడు. అనూహ్యంగా స్టార్ హీరో అయిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. ఇక ‘రౌడీ హీరో’గానూ జనం మదిలో నిలచిపోయాడు విజయ్.
విజయ్ దేవరకొండ 1989 మే 9న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ దేవరకొండ కుటుంబం నాగర్ కర్నూల్ సమీపంలోని తుమ్మనపేట గ్రామం నుండి హైదరాబాద్ వచ్చింది. ఆయన తండ్రి గోవర్ధనరావు కొన్ని టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేశారు. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి హై స్కూల్ లో విజయ్ చదివాడు. అక్కడ ఉన్న సమయంలోనే సత్యసాయిబాబాపై రూపొందించిన ఓ ప్రచార చిత్రంలో మహానటి షావుకారు జానకి సమక్షంలో నటించాడు విజయ్. బి.కామ్, చదివిన విజయ్ మొదటి నుంచీ నటనాభిలాషతోనే ఉన్నాడు. దాంతో పాత్రల కోసం పాదాలు అరిగేలా తిరగడం మొదలెట్టాడు. నటదర్శకనిర్మాత రవిబాబు రూపొందించిన ‘నువ్విలా’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించాడు విజయ్. తరువాత శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అజయ్ అనే పాత్రలో నటించాడు. దర్శకుడు నాగ అశ్విన్ తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’లో రిషి పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించాడు విజయ్. ఆ గుర్తింపుతోనే విజయ్ కి ‘పెళ్ళి చూపులు’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం లభించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో, ‘ద్వారక’లోనూ హీరో అనిపించుకున్నాడు. ఆపై సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’లో టైటిల్ రోల్ లో తనదైన బాణీ పలికించాడు విజయ్. ఆ సినిమా ఘనవిజయంతోనే విజయ్ స్టార్ స్టేటస్ సంపాదించాడు.
‘ఏ మంత్రం వేశావె’, ‘మహానటి’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించాడు విజయ్. ఇక పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీత గోవిందం’ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో విజయ్ దేవరకొండకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమా ఘనవిజయం తరువాత మెగాస్టార్ చిరంజీవి, విజయ్ ని “వెల్ కమ్ టు అవర్ స్టార్ వరల్డ్’ అంటూ ఆహ్వానించడం విశేషం! విజయ్ ఆ తరువాత గార్మెంట్స్ బిజినెస్ లోనూ అడుగు పెట్టి ‘రౌడీ బ్రాండ్’ను ఏర్పాటు చేశాడు. ఆ పై అనేక యాడ్స్ లోనూ విజయ్ కనిపించాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ సైతం అన్న బాటలోనే పయనిస్తూ నటనలో అడుగు పెట్టాడు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం వెదుకులాటలో మునిగిన విజయ్ కి ఇప్పుడు సినిమాలే వెదుక్కుంటూ వస్తున్నాయి. తాను సంపాదించిన ధనంతో ఓ ఛారిటబుల్ ట్రస్ట్ నూ ఏర్పాటు చేశాడు విజయ్. ప్యాండమిక్ సమయంలో తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు సాగాడు. తమ మహబూబ్ నగర్ లో ఏవీడీ సినిమాస్ అనే థియేటర్ ను నిర్మించి, తల్లి మాధవికి బహుమతిగా ఇచ్చారు దేవరకొండ బ్రదర్స్. ఇక తెలుగునేలపై ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే స్పందిస్తూ తనకు తోచిన ఆర్థిక సాయం అందిస్తూ ఉంటాడు విజయ్.
‘గీత గోవిందం’ గ్రాండ్ సక్సెస్ తరువాత విజయ్ నటించిన “డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్” వంటి చిత్రాలు వెలుగు చూశాయి. అయితే ఏవీ ‘గీత గోవిందం’ స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయాయి. ఇక “ఈ నగరానికి ఏమయంది?, మీకు మాత్రమే చెబుతా, జాతిరత్నాలు” వంటి చిత్రాలలో అతిథి పాత్రలలో కనిపించాడు విజయ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ విడుదలకు ముస్తాబవుతోంది. ఆగస్టు 25న ‘లైగర్’ జనం ముందుకు రానుంది. పూరి దర్శకత్వంలోనే విజయ్ ‘జనగణమన’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. ఇది కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటించబోతున్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘లైగర్’ మీదే ఉన్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ కి మునుపటిలా గ్రాండ్ సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.