విక్కీ కౌశల్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. ముఖ్యంగా, ‘యురి’ సినిమా తరువాత డైనమిక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా జనాల్లో జ్ఞాపకాల్లో ముద్రించుకుపోయాడు. అయితే, బాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వటం మామూలు విషయం కాదు. ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అటువంటిదే విక్కీ లైఫ్ లోనూ జరిగింది. అతను మరీ సినిమా రంగం నేపథ్యం లేని ఔట్ సైడర్ కాదు. అలాగని భారీగా వారసత్వం ఉన్న వాడు కూడా కాదు. అందుకే, మొదట్లో కొన్ని చిత్రాల ఆడిషన్స్ కు వెళ్లాడు. రిజెక్ట్ కూడా అయ్యాడు. వాటిల్లో ఒకటే… ‘భాగ్ మిల్కా భాగ్’.
రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్ లో రూపొందిన బయోపిక్ మూవీ ‘భాగ్ మిల్కా భాగ్’. అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథే ఈ సినిమా. అయితే, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం విక్కీ కౌశల్ ఆడిషన్స్ కి వెళ్లాడట. మూడు గంటలు అక్కడి క్యాస్టింగ్ డైరెక్టర్ టైం ఇచ్చినా కూడా సదరు క్యారెక్టర్ చేయలేకపోయాడట. ఒక్క సీన్ కూడా పండించలేకపోయాడట. ఆ రోజు తన వల్ల ఇక యాక్టింగ్ కాని పని అని నిర్ణయించుకున్నాడట!
‘భాగ్ మిల్కా భాగ్’లో హీరో ఫ్రెండ్ అవ్వలేకపోయిన విక్కీ కౌశల్ తరువాత తానే హీరో అయ్యాడు. ప్రస్తుతం బీ-టౌన్ న్యూ జనరేషన్ స్టార్స్ లో అత్యంత ప్రతిభావంతుడుగా దూసుకుపోతున్నాడు!