వెంకీ మామ మళ్ళీ అదే బాట పట్టాడు. ఇంతకు ముందే అభిమానులు వద్దంటే వద్దని వేడుకున్న పనినే మళ్ళీ చేస్తున్నాడు. మరోసారి అభిమానులకు నిరాశను కలిగిస్తూ తన నెక్స్ట్ మూవీని ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. దగ్గుబాటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న “దృశ్యం 2” మూవీ విడుదల తేదీని తాజాగా టీజర్ తో పాటు రివీల్ చేశారు మేకర్స్. అందులో నవంబర్ 25న “దృశ్యం 2” దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ లో విడుదల కానుంది అని ప్రకటించారు. ఈ ప్రకటనే వెంకీ అభిమానుల్లో నిరాశకు కారణమైంది.
Read Also : “దృశ్యం-2” టీజర్… ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
గతంలోనూ “నారప్ప” లాంటి యాక్షన్ ఫీస్ట్ మూవీలో వెంకటేష్ నట విశ్వరూపాన్ని వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్ ఆశలను అడియాశలు చేస్తూ ఓటిటిలో విడుదల చేశారు. వెంకటేష్ అండ్ టీం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఏమాత్రం రుచించలేదు. కారణాలు ఏవైనా అభిమానులకు పట్టలేదు. థియేటర్లలోనే తమ అభిమాన నటుడి సినిమాను విడుదల చేయాలని సోషల్ మీడియాలో దాదాపు ఉద్యమమే చేశారు. కొంతమంది అయితే ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. వెంకటేష్ స్వయంగా పరిస్థితులను వివరించడంతో శాంతించారు. ఇంత జరిగినా కానీ మరోసారి వెంకీ ఓటిటి బాట పట్టడం గమనార్హం.
“దృశ్యం 2” అమెజాన్ లో విడుదల అవుతుండడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది అభిమానులు అయితే “ఎన్నెన్నో అనుకుంటాం… అన్నీ అవుతాయా !” అంటూ తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. మిగిలిన వెంకీ ఫ్యాన్స్ మాత్రం థియేటర్లు అందుబాటులోకి వచ్చాక కూడా నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వెంకీ మామ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఓటిటి రిలీజ్ లకు సిద్ధమవ్వడం ఈసారైనా వెంకీ మామ సినిమాను బిగ్ స్క్రీన్ పై వీక్షించొచ్చని ఉబలాటపడుతున్న అభిమానుల ఉత్సాహంపై మరోసారి నీళ్లు చల్లినట్టే.