రాజ్యసభకు ఇటీవల ఎంపికైన 57 మంది సభ్యులలో సోమవారం 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 18 మంది తిరిగి ఎన్నికైన వారు ఉన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం సోమవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయేంద్ర ప్రసాద్ ఉత్సాహం కొద్ది ‘జైహింద్’ అంటూ నినదించారు. ఆ తర్వాత సభాపతి యం. వెంకయ్య నాయుడు ఓ సూచన చేయడం గమనార్హం.
‘ఓ సభ్యుడు సూచించిన ప్రతిని చదవకుండా, డీవియేషన్ చేశారని, అది సరి కాద’ని అన్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఇచ్చిన ప్రతిని మాత్రమే సభ్యులు చదవాలని, అదనంగా పదాలు జత పర్చడం సమంజసం కాదని, అది రికార్డులలో చేరదని తెలిపారు. ఎవరైనా సభ్యులు అభ్యంతరం లేవనెత్తితే వారి ప్రమాణ స్వీకారం తిరస్కారానికి గురయ్యే ఆస్కారం ఉందని, తాను ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి ఈ మాట చెప్పడం లేదని, ప్రమాణ స్వీకారం చేసేవారంతా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ ‘జైహింద్’ నినాదం తర్వాత వెంకయ్య ఈ సూచన చేయడంతో అది ఆయనను ఉద్దేశించే అనుకోవాల్సి వస్తోంది.