ఎండయినా, వానయినైనా, చలి అయినా – ఏదో ఒక రూపేనా మనిషిని కదలించి వేస్తుంటాయి. వానకు పరవశించి పోవడం ఓ చోట – వరదకు కుంగిపోవడం మరో చోట కనిపిస్తుంది. చెమటలు కక్కించే ఎండల్లోనూ హుషారుగా సాగేవారు కొందరయితే, ఎండదెబ్బకు అనారోగ్యం పాలు కావడమూ కనిపిస్తుంది. చలిలో గిలిగిలికి గురయ్యేవారు కొందరయితే, ఆ చలి తీక్షణమై చితికిపోయినవారూ ఉంటారు. ఇలా అన్ని కాలాలు కొందరికి ప్రమోదం, మరికొందరికి ప్రమాదంగా పరిణమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆగని వానలకు కొన్ని చోట్ల భయానక వాతావరణం నెలకొంది. మరికొందరిలో అదే వానలు తపనలు రేపుతున్నాయి. ఈ సమయాన “గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం…” అంటూ గోడుమనే బాధ కొందరిదయితే, “చినుకు చిటికేసింది…” అని పరవశించి పోయవారూ లేకపోలేదు. ఈ సందర్భంగా కాసేపు అన్నీ మరచి సరదాగా కొన్ని వానపాటలను గుర్తు చేసుకుందాం.
తెలుగు సినిమాల్లో వానపాటలు అనగానే ముందుగా గుర్తుకొచ్చే పాటలు – ‘ఆత్మబలం’ (1964)లోని “చిటపట చినుకులు పడుతూ ఉంటే…” అన్నది, ఆ పై ‘వేటగాడు’ (1979)లోని “ఆకుచాటు పిందె తడిసె…” అంటూ సాగేది. ఈ రెండు పాటల్లో మొదటి దానిలో ఏయన్నార్, రెండో పాటలో యన్టీఆర్ నటించారు. ఆ మహానటులిద్దరూ నటించిన ఈ పాటలు ఈ నాటికీ వాన వచ్చినా, వానపాటలు గుర్తుకు వచ్చినా తెలుగు జనానికి చప్పున గుర్తుకు వస్తూ ఉంటాయి. మరి యన్టీఆర్, ఏయన్నార్ అంతకు ముందు వానపాటల్లో నటించలేదా? అంటే నటించారనే చెప్పాలి. కాకపోతే, పూర్తి స్థాయి వానపాటలు కావు. ఏయన్నార్ పై ‘మూగమనసులు’ (1964) చిత్రం కోసం “ఈ నాటి ఈ బంధమేనాటిదో…” పాటలో కొంతభాగాన్ని వాన నేపథ్యంలో చిత్రీకరించారు. అయితే ఈ సినిమా తరువాత మొదలైన ‘ఆత్మబలం’ ఓ మూడువారాలు ముందుగా విడుదలయింది. యన్టీఆర్ వాన పాటల్లో ముందు ‘సంగీతలక్ష్మి’ (1966)లో “కలో నిజమో…” అనే పాటలో కొంత భాగం వానలో చిత్రీకరించారు. అంతకు ముందు యన్టీఆర్ ‘దేవత’ (1965)లో “బ్రతుకంత బాధగా…” అనే విషాద గీతంలో కొంత భాగం వాన నేపథ్యంలోనే చిత్రీకరించారు.
యన్టీఆర్ వాన పాటల్లో “ఝుమ్ ఝుమ్ తుమ్మెద పాడింది…” అంటూ సాగే ‘చిట్టి చెల్లెలు’ (1970) సినిమా గీతం గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో కూడా కొంత భాగమే వానలో చిత్రీకరించారు. ఆ పై యన్టీఆర్ ‘మా ఇద్దరి కథ’ (1977)లో “చలి చలిగా ఉందిరా… హొయ్ రామా…” సాంగ్ పూర్తి స్థాయి వాన పాట అని చెప్పవచ్చు. ఆ తరువాతే ‘వేటగాడు’లోని “ఆకు చాటు పిందె తడిసె…” వచ్చి జనాన్ని ఉర్రూత లూగించింది. ఇక ఏయన్నార్ వాన పాటల్లో ‘ప్రేమనగర్’ (1971)లోని “తేట తేట తెలుగులా…” పాట, “ఎవరి కోసం… ఎవరి కోసం…” అనే పాటలు వర్షం నేపథ్యంలో రూపొందినవే! అయితే యుగళ గీతాలు కావు. ‘ముద్దుల కొడుకు’ (1979)లోని “చిట పట చినుకుల మేళం…” అంటూ సాగే పాట అలరించింది. ఆ పై ‘సంగీత సమ్రాట్’ (1984)లోని “జడివాన పడుతుంటే…” అంటూ సాగే రెయిన్ సాంగ్ సైతం కనువిందుచేసింది.
కృష్ణ విషయానికి వస్తే ‘అక్కాచెల్లెలు’ (1970)లోని “చిటపటా చినుకులలో…” సాంగ్ మురిపించింది. ఆ తరువాత ‘ఏజెంట్ గోపి’ (1978)లోని “చిటపటా చినుకులు మనకోసం కురిశాయి…” సాంగ్, ‘ఘరానాదొంగ’లోని “వాన కురిసిన వేళ…” అంటూ సాగే పాట భలేగా అలరించాయి. తరువాతి రోజుల్లోనూ కృష్ణ అనేక రెయిన్ సాంగ్స్ లో నటించారు. వాటిలో ‘అదృష్టవంతుడు’లోని “చినుకు చినుకు…” పాట, ‘ఇద్దరూ అసాధ్యులే’ లోని “చినుకు చినుకు పడుతూ ఉంటే…” అంటూ సాగే సాంగ్ మురిపించాయి. ‘మామాఅల్లుళ్ళ సవాల్’లోని “చిటుకూ చిటుకూ… అనే పాట కూడా అలరించింది. చిత్రంగా శ్రీదేవితోనే కృష్ణ అనేక సినిమాల్లో రెయిన్ సాంగ్స్ లో నటించారు.
శోభన్ బాబు వాన పాటల్లో ‘సోగ్గాడు’ (1975)లోని “చలివేస్తుంది చంపేస్తుంది…” అన్నిటికన్నా మిన్నగా మురిపించింది. ‘జగన్’లోని “రాక రాక వచ్చింది… గాలివాన…” అని సాగే పాట సైతం ఆకట్టుకుంది. ఆయనపై చిత్రీకరించిన ‘స్వయంవరం’లోని “గాలివానలో… వాన నీటిలో…” అంటూ సాగేది విషాద గీతం. ‘ఘరానాగంగులు’లోని “బుడి బుడి గొడుగుల్లో…” అని సాగే పాట, ‘దొరికితే దొంగలు’లోని “తడిసిన కోకకు తపనొకటుంది…” అంటూ మొదలయ్యే సాంగ్ కూడా అలరించాయి. కృష్ణంరాజు వాన పాటల్లో ‘అమ్మానాన్న’లోని “కురిసే చినుకుల గుసగుసలు…” అనే పాట, ‘భగవాన్’లోని “వలపుంటే వాటేసుకోవయ్యా…” సాంగ్ భలేగా మురిపించాయి. మోహన్ బాబు రెయిన్ సాంగ్స్ లో ఎవర్ గ్రీన్ అంటే ‘రంగూన్ రౌడీ’లోని “వానొచ్చే వరదొచ్చే…” పాట. హీరో అయిన తరువాత ‘భలేరాముడు’లోని “చినుకు చినుకు…” సాంగ్, ‘తప్పు చేసి పప్పుకూడు’లోని “వాన కొడతాంది కొడతాంది పైనా…” పాట కూడా మురిపించింది.
చిరంజీవి వాన పాటల్లో ‘దేవాంతకుడు’లోని “గడియకో కౌగిలింత…” లో కొంత భాగం వానలో చిత్రీకరించారు. తన తరం హీరోల్లో ఎక్కువగా వానపాటల్లో మురిపించింది మెగాస్టార్ అనే చెప్పాలి. ‘అడవిదొంగ’లోని “వానా వానా వందనం…”, అంటూ సాగే పాట, ‘యముడికి మొగుడు’లోని “వానజల్లే గిల్లుతుంటే ఎట్టాగమ్మా…” అని మొదలయ్యే గీతం, ‘గ్యాంగ్ లీడర్’లోని “వానా వానా వెల్లువాయె…” అని సాగే పాట ‘ఘరానా మొగుడు’లోని “కిటుకులు తెలిసిన చిటపట చినుకులు…” సాంగ్ భలేగా అలరించాయి. ‘నాగు’లోని “నన్నంటుకోమాకు చలిగాలి…” అని ఆరంభమయ్యే పాట, ‘జ్వాల’లోని “కలికి చిలక చలికి దరి చేరగనే….” అని మొదలయ్యే పాట, ‘బిగ్ బాస్’లోని “ఉరుమొచ్చేసిందోయ్…”అని సాగే గీతం కూడా ఆకట్టుకున్నాయి.
బాలకృష్ణ వాన పాటలు అనగానే ‘దేశోద్ధారకుడు’లోని “వచ్చె వచ్చె వాన జల్లు…” పాట ముందుగా గుర్తుకు వస్తుంది. ‘భార్గవరాముడు’లోని “వయ్యారమా దాని యవ్వారమేమి…” పాటలో కొంత భాగం వర్షంలో చిత్రీకరించారు. ఇక ‘రౌడీ ఇన్ స్పెక్టర్’లోని “చిటపట చినుకులు తనువులు తడిపే వానలో…” పాట, ‘బంగారుబుల్లోడు’లోని “స్వాతిలో ముత్యమంత ముద్దులా…” అంటూ మొదలయ్యే గీతం, ‘నారీ నారీ నడుమ మురారి’లోని “ఏం వానో తరుముతున్నది…” అని సాగే సాంగ్ భలేగా అలరించాయి. ‘మాతో పెట్టుకోకు’లోని “మజారే గజ్జల గుర్రమిది…” సాంగ్, ‘ధర్మక్షేత్రం’లోని “ముద్దులతో శృంగార బీటు…” పాట జనాన్ని మురిపించాయి.
నాగార్జున వాన పాటల్లో ‘ఆఖరి పోరాటం’లోని “స్వాతిచినుకు సందెవేళలో…” సాంగ్ అగ్రస్థానం ఆక్రమిస్తుంది. ఆ తరువాత ‘కిరాయిదాదా’లోని “కురిసే మేఘాలు….” అని సాగే పాట, ‘అల్లరి అల్లుడు’లోని “కమ్మని ఒడి బొమ్మని…” సాంగ్, ‘ప్రేమయుద్ధం’లోని “స్వాతిముత్యపు జల్లులలో…” అంటూ మొదలయ్యే గీతం, ‘విజయ్’లోని “వాన రాతిరి…” అని సాగే పాట, ‘చైతన్య’లోని “స్వీటీ ఎంత…” సాంగ్ కూడా అలరించాయి. వెంకటేశ్ రెయిన్ సాంగ్స్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’లోని “ఒక్కసారి చెప్పలేవా…” అని సాగే పాట మురిపించింది. అలాగే ఆయనపై చిత్రీకరించిన ‘సరదా బుల్లోడు’లోని “చిత్త కార్తిలో…” పాట, ‘అగ్గిరాముడు’లోని “హాయిలే… హాయిలే…”, ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’లోని “ఓలమ్మి తిమ్మిరే…” పాటలో కొంతభాగం వానల్లోనే చిత్రీకరించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని “వాన చినుకులు…” సాంగ్ సైతం భలేగా ఆకట్టుకుంది.
తరువాతి తరం హీరోల్లోనూ పలువురు వాన పాటల్లో భలేగా ఆకట్టుకున్నారు. విశేషమేమిటంటే, పాపులర్ హీరోయిన్ సౌందర్యతో స్టార్ కమెడియన్ బాబు మోహన్ ‘మాయలోడు’ కోసం చిందేసిన “చినుకు చినుకు అందెలతో…” పాట ఆ రోజుల్లో ఓ ఊపు ఊపేసింది. మరి భవిష్యత్ లో ఎందరు వాన పాటలతో తెలుగువారిని అలరిస్తారో చూద్దాం. ఆ లోగా మీరు కూడా మీకు గుర్తు వచ్చిన వాన పాటలను ఈ వానవేళ తలచుకొని మురిసిపోతారని ఆశిస్తాం!