Hello Meera: సింగిల్ క్యారెక్టర్‌తో ఓ డిఫరెంట్ మూవీని రూపొందించి తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు బాపు శిష్యుడైన శ్రీనివాసు ‘హలో మీరా’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. దీన్ని డాక్టర్ లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించారు. ఈ మూవీలోని సింగిల్ క్యారెక్టర్ ను గార్గేయి యల్లాప్రగడ పోషించారు. ఈ ప్రయోగాత్మక చిత్రం ట్రైలర్ ను డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ట్రైలర్ చూసిన వినాయక్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగా వచ్చిందని, సింగిల్ క్యారెక్టర్ తీసుకొని ఇంత థ్రిల్ చేసే సినిమా తీయడమనేది ఓ సవాల్‌తో కూడిన పని అని, అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని తెలిపారు. ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
తెల్లవారితే పెళ్ళి అనగా, రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కథానాయిక మీరా కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఆ తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది? అనే కాన్సెప్ట్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుంది. జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు మీరాను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు… ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించినట్టు ఈ ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచారు మేకర్స్. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీని శ్రీనివాసు తెరకెక్కించారు. వైవిద్యభరితమైన కథతో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమా ‘హలో మీరా’ అని ఈ రెండు నిమిషాల 26 సెకనుల నిడివి ఉన్న ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఎస్. చిన్నా సంగీతాన్ని అందించిన ‘హలో మీరా’ చిత్రానికి జీవన్ కాకర్ల సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.