Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణకు వారి కన్నవారు ఏ ముహూర్తాన ‘బాలకృష్ణ’ అని పేరు పెట్టారో కానీ, వయసు పెరిగే కొద్దీ ఆయన మరింత బాలునిగా తయారవుతున్నారు. తన కంటే వయసులో పెద్దవారితోనూ, తన ఈడు వారితోనూ, తన కంటే ఎంతో చిన్నవాళ్ళతోనూ ‘అన్ స్టాపబుల్’లో బాలయ్య చేస్తున్న సందడి చూస్తోంటే అది నిజమే అనిపించక మానదు. ‘ఆహా’లో ‘యన్బీకే అన్ స్టాపబుల్-2’ సీజన్ లో మూడో ఎపిసోడ్ శుక్రవారం జనం ముందు నిలచింది. ఇందులో యువ కథానాయకులు శర్వానంద్, అడివి శేషు అతిథులుగా పాల్గొన్నారు. అందులో బాలయ్యతో మాట్లాడటానికి ఇద్దరు హీరోలు భయపడి నువ్వు ముందు వెళ్ళు అంటే, నువ్వు ముందు వెళ్ళు అంటూ వంతులు వేసుకున్నారు. అది చూసిన బాలకృష్ణ “అహె.. ముందు వచ్చేయండి..” అంటూ తనదైన పంథాలో అన్నారు. ముందు శర్వానంద్, తరువాత శేషు వచ్చారు. బాలయ్యకు శేషు పాదాభివందనం చేయబోతే, “పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదని” అన్నారాయన. “ఆయన పేరే బాలకృష్ణ.. స్టిల్ ‘బాల'” అంటూ శర్వానంద్ వంత పాడారు. ఇలా సరదాగా మొదలైన ఈ ఎపిసోడ్ లో బోలెడు విషయాలు పంచుకున్నారు.
ఓ సారి క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ గా ఉండటానికి శర్వానంద్ ను ఆగమేఘాల రమ్మని పిలచిన బాలయ్య, తీరా శర్వా వచ్చాక మాట్లాడలేదని ఆ విషయాన్ని గుర్తు చేసుకొని నవ్వులు పూయించారు. అలాగే తనకు ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడు బాలకృష్ణ హీరోగా నటించిన ‘టాప్ హీరో’లోని “బీడీలు తాగండి బాబులు..”అంటూ పాట పాడుకుంటూ ఇంటికి వెళితే, తన తల్లి నెత్తిమీద ప్లేట్ తో ఒక్కటిచ్చారని, ఆ సొట్టపోయిన వస్తువు ఇప్పటికీ ఉందని శేషు గుర్తు చేసుకోవడంతో వీక్షకులకు వినోదం కలిగింది. ఆ ఇద్దరు హీరోల కథల ఎంపికను గురించి, బాలకృష్ణ అభినందించారు. శర్వానంద్ నటించిన “గమ్యం, అందరిబంధువయ్యా” సినిమాలు, అడివి శేషు చేసిన “క్షణం, మేజర్” వంటి చిత్రాలు తన హృదయాన్ని కదిలించాయనీ బాలయ్య తెలిపారు. తాను ‘మేజర్’ సినిమా చేయడానికి కారణం వివరిస్తూ దేశం కోసం ప్రాణాలిచ్చిన ‘సందీప్ ఉన్నికృష్ణన్’కు తాను ఫ్యాన్ అని అందుకే ఆ సినిమా చేశానని వివరించారు శేషు. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమా గురించి అనుభవాలు తెలుపడమూ ఆకట్టుకుంది. ‘ఒకే ఒక జీవితం’ గురించి చర్చిస్తున్నప్పుడు ‘టైమ్ ట్రావెల్’ గురించిన చర్చ చోటు చేసుకుంది. ఆ సమయంలో బాలకృష్ణ తన ‘ఆదిత్య 369’ను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఆదిత్య మ్యాక్స్ 999’ కథ తానే రాసుకున్నాననీ బాలయ్య చెప్పడం అభిమానులకు ఆనందం పంచక మానదు.
ఈ సారి గెస్ట్స్ గా వచ్చిన వారికి ఇచ్చిన టెస్ట్ లో టాస్క్ భలే విచిత్రంగా ఉంది. ‘స్వేప్ ఇఫ్ ఇటీజ్ ట్రూ’ అన్నది ఆ గేమ్ పేరు. తెరపై కనిపించే ప్రశ్నల్లో ఏదైనా నిజమయితే, వచ్చిన వాళ్ళు బట్టలు ఇప్పేయాలన్నది నియమం. ఆ విధంగా ఇద్దరు హీరోలు తమ కెరీర్ కు సంబంధించిన అంశాలపై వచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి మరీ వేసుకున్న కోటు విప్పారు. కొన్ని సార్లు ‘శ్రుతి మించిన రాగాలు’ వినిపించాయి. వారిద్దరితో కలసి బాలయ్య కూడా కోటు విప్పి డాన్స్ చేయడం ఆకట్టుకుంటుంది. తన జీవితంలో ‘బిగ్ లాస్’ తాత మరణం అని శర్వానంద్ సమాధానం చెప్పారు. అందుకే ఆత్రేయగారు ‘పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు..” అన్నారని బాలయ్య గుర్తు చేశారు. ఆటలో భాగంగా రానా దగ్గుబాటికి శర్వానంద్ ఫోన్ చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో రానాకు ‘నువ్వు టాక్ షో ప్రిన్స్..నేను టాక్ షో కింగ్..” అంటూ బాలయ్య చెప్పగానే, “మీరెప్పుడూ కింగే సార్..” అంటూ రానా అటు నుంచి సమాధానమిచ్చారు. తరువాత శేషు తన తల్లికి ఫోన్ చేయవలసి వచ్చింది. “అమ్మా..మీరు నన్ను సార్ అనకండి.. మీ అబ్బాయి కంటే వయసులో చిన్నవాణ్ణి..” అంటూ బాలయ్య చేసిన సరదా అందరినీ అలరించింది.
సాయి పల్లవికి పొయెట్రీ అంటే ఇష్టమని శేషు చెప్పగా, ‘షాయరీలు వింటావా’ అని బాలయ్య అడిగారు. ఆ సమయంలో బాలయ్య చెప్పిన షాయరీలకు ఇద్దరు హీరోలు ‘వాహ్వా..’ అంటూ జేజేలు పలికారు. అలాగే ‘బొబ్బిలిసింహం’ షూటింగ్ సమయంలో మీనాతో ముద్దు ముచ్చట్ల గురించి కూడా చెప్పి అందరినీ అలరించారు బాలయ్య. ‘ఎవరికి ముద్దు పెట్టడం ఇష్టం లేదు’ అని అడిగిన ప్రశ్నకు, “పూజా హెగ్డే” అని సమాధానమిచ్చారు శేషు. ఈ షోలో ‘డోంట్ వేస్ట్ ఫుడ్ మల్లేశ్వరరావు’ స్పెషల్ గెస్ట్ గా రావడం ఆకట్టుకుంది. ఆయన రోజూ హోటల్స్ లో మిగిలిన పోయిన ఫుడ్ ను కలెక్ట్ చేసి, రోజుకు కొన్నివందల మందికి ఆహారం అందిస్తూ ఉంటారు. మల్లేశ్వరరావుకు అవసరం అనిపించినప్పుడు తమ తలుపు తట్టవచ్చునని ఇద్దరూ హీరోలు హామీ ఇచ్చారు. ఇలాంటి విశేషాలు బోలెడు మూటకట్టుకున్న యన్బీకే అన్ స్టాపబుల్ సీజన్ 2లోని మూడో ఎపిసోడ్ ను చూసేస్తే వినోదం మన సొంతం కాక మానదు.