Krishnam Raju: దివంగత నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం కృష్ణంరాజు ఇంటికి చేరుకున్న ఆయన ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవిని కలిశారు. కృష్ణంరాజు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనను చూసి శ్యామలా దేవి కంటతడి పెట్టుకున్నారు. శ్యామలా దేవిని, ఆమె కుమార్తెలకు ధైర్యం చెప్పారు. ఇక ప్రభాస్..వారిని సాదరంగా ఆహ్వానించి కొద్దిసేపు ముచ్చటించారు. కృష్ణంరాజు రాజకీయాల్లో చేసిన సేవల గురించి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరించారు.
“కృష్ణంరాజు చాలా ఏళ్లుగా నాకు ఆత్మీయ మిత్రుడు, ఢిల్లీలో ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు, బాహుబలి విడుదలైనప్పుడు కృష్ణంరాజు, ప్రభాస్‌ను అభినందించాం, గోహత్య నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజునే. తర్వాత కాలంలో యోగి అదిత్యనాధ్ కూడా గోహత్య నిషేధ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్ కానీ కృష్ణంరాజు గ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి. గ్రామంలో ప్రతీ ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారు ప్రతీ ఒక్కరినీ పేరుతో పిలుస్తారని” తెలిపారు. ఇక కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్ కూడా ఈ పరామర్శలో పాల్గొన్నారు.