Sirivennela Seetharama Sastry: పద్మశీ అవార్డు గ్రహీత, స్వర్గీయ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి దివికేగి ఏడాదిన్నర గడిచినా… ఆయన పాటలను తెలుగు సాహిత్య అభిమానులు, సంగీత ప్రియులు అనునిత్యం తలుచుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు తానా సంస్థతో కలిసి ఆయన సంపూర్ణ సాహిత్యాన్ని వెలువరుస్తున్నారు. అందులో కొన్ని సంపుటాలు ఇప్పటికే వచ్చాయి. మరి కొన్ని రాబోతున్నాయి. ఇదిలా ఉంటే… ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతి (మే 20) సందర్భంగా రెండు అమూల్యమైన పుస్తకాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ‘పూర్ణత్వపు పొలిమేరలో…’. సీతారామశాస్త్రి వ్యక్తిత్వ విశ్లేషణను తెలియచేసే ఈ పుస్తకాన్ని వారి సోదరుడు శ్రీరామశాస్త్రి రచించి, సంకలనం చేశారు. ఎమెస్కో సంస్థ ప్రచురించిన ఈ పుస్తకాన్ని భాషా సాంస్కృతిక విభాగం తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో ఈ నెల 20వ తేదీ హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం 5.30కి ఆవిష్కరించబోతున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా, ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్; ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆత్మీయ అతిథులుగా, మామిడి హరికృష్ణ విశిష్ఠ అతిథిగా ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనబోతున్నారు.
అలానే మే 19వ తేదీ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో సాయంత్రం 6 గంటలకు సీతారామశాస్త్రికి సంబంధించిన మరో పుస్తకాన్ని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సంస్థ ఆవిష్కరించబోతోంది. ‘సిరివెన్నెల రసవాహిని’ (సినీ గీత విశ్లేషణ) పేరుతో ప్రముఖ రచయిత డాక్టర్ పైడిపాల ఈ పరిశోధనాత్మక రచన చేశారు. ఈ కార్యక్రమానికి డా. కె.వి రమణ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతుండగా ఎన్.వి.ఎస్. రెడ్డి, డా. ఎ.వి. గురవారెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొనబోతున్నారు.