Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!

Trisha

Trisha

Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో, ఆయనను చివరిసారిగా వెండితెరపై చూస్తున్నామనే భావన అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. సినిమా ముగిసిన తర్వాత పలువురు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో విజయ్‌కు అభిమానులు భావోద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ఆమెను చూసిన అభిమానులు సందడి చేయగా, త్రిష చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు. విజయ్‌తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం గురించి గతంలో ఎన్నోసార్లు చర్చ జరిగిన నేపథ్యంలో, ఆమె ‘జన నాయగన్’ను థియేటర్‌లో వీక్షించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. సినిమా చూసిన తర్వాత భావోద్వేగానికి గురై, చిరునవ్వుతో బయటికి వచ్చారు. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ‘జన నాయగన్’ సినిమా ఇండియా వైడ్‌గా సుమారు 2,500 స్క్రీన్లలో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో తెల్లవారుజామునే ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభమవగా, తమిళనాడులో ఉదయం నుంచి సాధారణ షోలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, నారాయణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.