Tollywood: ఈ ఏడాదిలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. అయితే దసరాకు వచ్చే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో పాటు రవితేజ ‘ధమాకా’ను పక్కనబెడితే మరో పెద్ద సినిమా కనిపించడం లేదు. టాలీవుడ్‌లో వచ్చే మూడు నెలల పాటు అన్ని కుర్రహీరోల సినిమాలే విడుదల కానున్నాయి. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. దీంతో సంక్రాంతి వరకు కుర్ర హీరోలే టాలీవుడ్‌లో రాజ్యమేలే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జాబితాలో నిఖిల్, అడివి శేష్, విశ్వక్ సేన్, అల్లరి నరేష్, సత్యదేవ్, కిరణ్ అబ్బవరం, తేజ సజ్జా సినిమాలు ఉన్నాయి. కార్తీకేయ-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ ‘18 పేజేస్’ సినిమాతో ముందుకు రాబోతున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ మూవీ నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: Cooking Oil: వంట నూనెల దిగుమతిపై కేంద్రం గుడ్ న్యూస్
అటు మేజర్ మూవీతో సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్ హిట్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ కథాంశంతో శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 2న థియేటర్లలోకి రానుంది. అటు అశోకవనంలో అర్జునకళ్యాణం మూవీతో ఆకట్టుకున్న హీరో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మూవీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో హీరో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో సందడి చేయనున్నాడు. మరోవైపు నాంది వంటి హిట్ తర్వాత అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ నవంబర్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. మరో యువ హీరో సత్యదేవ్ కూడా వరుస సినిమాలతో అలరించనున్నాడు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీలో విలన్‌గా నటించిన సత్యదేవ్ ఇటు హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతడు నటించిన రామ్ సేతు, గుర్తుందా శీతాకాలం సినిమాలు నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. కిరణ్ అబ్బవరం కూడా వినరో భాగ్యము విష్ణుకథ, రూల్స్ రంజన్ సినిమాలతో సందడి చేయనున్నాడు. తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ కూడా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.