ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2022 తర్వాత ఇక సినిమాలో నటించనంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నటనను నేను పట్టించుకోవడంలేదు, మీరూ పట్టించుకోకండీ’ అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాహుల్ రామకృష్ణ శుక్రవారం రాత్రి పెట్టిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు కామెడీ చేయడం మొదలు పెట్టారు. ‘ఇది ఎన్నో రౌండ్?’ అని కొందరు అడుగుతుంటే, ‘వర్మలా ఓడ్కా తాగి ఇలాంటి పోస్టులు పెడుతున్నావా?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘జెర్సీ’ మూవీ తరహాలో ఏదైనా ఆరోగ్య సమస్యా? అని ఇంకొందరు ఆరా తీస్తున్నారు. మరికొందరైతే ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్ళిపోతా!’ అని ‘జాతిరత్నాలు’లోని డైలాగ్ చెబుతున్నావేంటి బ్రో? అని అడుగుతున్నారు. మరికొందరు మాత్రం ‘మీలాంటి చక్కని హాస్యనటుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగద’ని సిన్సియర్ గా హితవు పలుకుతున్నారు.
Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!
రాహుల్ రామకృష్ణ కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు… జర్నలిస్ట్ కూడా. ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఆయన పనిచేశాడు. విదేశాల నుండి వచ్చే ప్రతినిధులకు అతను అంబాసిడర్ గానూ సేవలు అందించేవాడని చెబుతుంటారు. సినిమాల్లో నటించినా కూడా తన పరిమితులను దృష్టిలో పెట్టుకుని, తనకు నచ్చినట్టే అతను చేసేవాడని అంటారు. గత కొంతకాలంగా రాహుల్ నటనలో వేరియేషన్స్ ఉన్నాయి కానీ అతని ఆకారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. అదే గడ్డంతో తనకు నచ్చినట్టుగానే ఉంటూ తెర మీద కనిపించాడు. అతన యాటిట్యూడ్ కు సినిమాలు సెట్ కావు అన్నవాళ్ళూ ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘స్కైలాబ్’లోనూ, తాజాగా జనం ముందుకు వచ్చిన ‘గుడ్ లక్ సఖి’లోనూ రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించాడు. పలు చిత్రాలలోనూ నటిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ కు సన్నిహితుడైన రాహుల్ రామకృష్ణ మరి రాబోయే రోజుల్లో నిర్ణయం మార్చుకుంటాడేమో చూడాలి.