అందాలతారగా సైరా బాను యావద్భారతదేశాన్నీ ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో సైరా బాను ఓ చిత్రంలో నటించింది అంటే సదరు సినిమా చూడటానికి రసికాగ్రేసరులు థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ తరువాత మహానటుడు దిలీప్ కుమార్ ను పెళ్ళాడిన సైరా బాను సినిమాలకు దూరంగా జరిగారు. అయినా, సైరా బానును తమ కలలరాణిగా చేసుకొని ఎంతోమంది ఆనందించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘జంగ్లీ’ అక్టోబర్ 31తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా తెలుగులో యన్టీఆర్ హీరోగా ‘సరదా రాముడు’ పేరుతో రీమేక్ అయింది. 1961 అక్టోబర్ 31న జనం ముందు నిలచిన ‘జంగ్లీ’ సినిమాలోని పాటలు జనాన్ని ఎంతగానో అలరించాయి. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచి, బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది.
జంగ్లీ కథలో పెద్దగా వైవిధ్యం కనిపించదు. అయితే, ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం ప్రాణం పోసి, సినిమాను విజయతీరాలకు చేర్చిందని చెప్పొచ్చు. ‘జంగ్లీ’ కథలోకి తొంగి చూస్తే, ఓ జమీందార్ భార్యకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఉంటారు. తమ ఇంటిలో అనవసరమైన మాటలు కానీ, నవ్వులు కానీ వినిపించరాదని జమిందారిణి ఆజ్ఞ. లండన్ లో చదువుకొని వచ్చిన ఆమె కొడుకు శేఖర్ తల్లి మాట జవదాటడు. ఇక కూతురు మాలా అన్నకు పూర్తి భిన్నం. సరదాగా నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటుంది. తమ ఎస్టేట్ లో పనిచేసే జీవన్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన తల్లి, శేఖర్ ను పిలిచి, కొంతకాలం మాలాను ఎక్కడికైనా తీసుకుపొమ్మంటుంది. చెల్లిని తీసుకొని శేఖర్ కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ ఓ డాక్టర్ కూతురు రాజకుమారి పరిచయమవుతుంది. ఓ సారి అనుకోకుండా శేఖర్, రాజకుమారి మంచు తుఫాను కారణంగా ఓ చోట చిక్కుకుపోతారు. వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకుమారి పరిచయంతో శేఖర్ కు తొలిసారి జీవితంలోని అసలు మాధుర్యం బోధపడుతుంది. అతని ఆనందానికి అవధులు లేకుండా చిందులు వేస్తాడు. మాలా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయాన్ని రాజకుమారి, ఆమె తండ్రి డాక్టర్ రహస్యంగా ఉంచుతారు. కాశ్మీర్ నుండి తిరిగి వచ్చాక తనయునిలో మార్పు చూసి ఆశ్చర్యపోతుంది జమిందారిణి. మాలా, జీవన్ అప్పటికే రహస్య వివాహం చేసుకున్నారన్న సత్యం తెలుస్తుంది. చివరకు మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని తల్లికి తెలియజేసేందుకు శేఖర్ ఓ నాటకం ఆడతాడు. ఆమె కూడా రాజకుమారిని తన కోడలుగానూ, జీవన్ ను తన అల్లుడిగానూ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.
కథలో పెద్దగా వైవిధ్యం లేకపోయినా, సన్నివేశాలతో రక్తి కట్టించారు చిత్ర దర్శకనిర్మాత సుబోధ్ ముఖర్జీ. ఈ చిత్రానికి కథ, రచన కూడా ఆయనే నిర్వహించడం విశేషం. ఇందులో శేఖర్ గా షమ్మీకపూర్, రాజకుమారిగా సైరా బాను, మాలాగా శశికళ, జీవన్ గా అనూప్ కుమార్ నటించారు. మిగిలిన పాత్రల్లో లలితా పవార్, అజ్రా, మోనీ ఛటర్జీ, అజిత్ సేన్, శివ్ రాజ్, మెక్ మోహన్, హెలెన్ కనిపించారు. శంకర్ – జైకిషన్ బాణీలతో శైలేంద్ర, హస్రత్ జైపురి రాసిన పాటలు అలరించాయి. ఈ సినిమా అనగానే ఈ నాటికీ అందరికీ గుర్తుకు వచ్చే పాట – “ఛాహే కోయి ముఝే జంగ్లీ కహే…” అన్నదే. ఈ పాటతో పాటు “ఆయ్ ఆయ్ సుకు సుకు…”, “జా జా జా మేరే బచ్ పన్…” పాటలను కూడా శైలేంద్ర కలం పలికించింది. హస్రత్ జైపురి కలం నుండి “ఎహ్ సాన్ తేరే హోగా…”, “దిన్ సారా గుజారా తోరే అంగనా…”, “కష్మీర్ కీ ఖలీ హూ మై…”, “నై తుమ్ హారే మజేదార్…” పాటలు జాలువారి ఆకట్టుకున్నాయి. “ఛాహే కోయి ముఝే జంగ్లీ కహే…” పాటను మహ్మద్ రఫీ గానం చేశారు. ఈ పాటలో ముందుగా వినిపించే “యాహూ…” అన్న కేకను రఫీ వేయలేదని, ప్రయాగ్ రాజ్ అనే గాయకుడు అరిచారని తరువాతి రోజుల్లో హీరో షమ్మీ కపూర్ బయలు పరిచారు. ఇదే కథతో 1984లో కుమార్ గౌరవ్ హీరోగా ‘హమ్ హై లాజవాబ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఏది ఏమైనా ‘జంగ్లీ’ సినిమా ద్వారా సైరా బాను వంటి అందాలతార పరిచయం అయ్యారు. ‘యాహూ…’ అంటూ మారుమోగి పోయిన పాట ఈ నాటికీ అలరిస్తోంది.