త్రివిక్రమ్ మాటే మంత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు మాటల మాంత్రికుడు అనగానే తెలుగువారికి ప్రఖ్యాత రచయిత పింగళి నాగేంద్రరావు గుర్తుకు వచ్చేవారు. కానీ, ఈ తరం ప్రేక్షకులు మాత్రం ‘మాటల మాంత్రికుడు’ అని త్రివిక్రమ్ కు పట్టం కట్టేశారు. త్రివిక్రమ్ సైతం తన ప్రతి చిత్రంలో మాటలతో పరాక్రమం చూపిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు పదనిసలు పలికించినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు సరిగమలూ వినిపిస్తాయి. మరికొన్ని సార్లు వీరధీరశూరంగా విజృంభిస్తాయి. అందుకే జనం ‘మాటల మాంత్రికుడు’ అనేశారు. త్రివిక్రమ్ కూడా ఆ మాటను నిలుపుకుంటూ తన కలంతో కదం తొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికి ఆరు సార్లు ఉత్తమ మాటల రచయితగా నందిని దక్కించుకున్నారు. దీనిని బట్టి ఆయన మాటే మంత్రమై జనాన్ని పరవశింప చేస్తోందని చెప్పవచ్చు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. త్రివిక్రమ్ చదువులో దిట్ట అనిపించారు. డిగ్రీ దాకా భీమవరంలోనే సాగిన త్రివిక్రమ్ చదువు తరువాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో గోల్డ్ మెడల్ సంపాదించింది. బాల్యం నుంచీ సినిమాలపై ఆకర్షణ పెంచుకున్నారు త్రివిక్రమ్. ఆయనతో కాలేజ్ మేట్ అయిన సునీల్ సైతం అదే ధ్యాసతో ఉండడం వల్ల మిత్రులు హైదరాబాద్ చేరారు. చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పట్లో పోసాని కృష్ణమురళి కథలు, మాటలతో అలరిస్తున్నారు. ఆయన చెంతకు చేరి, కొన్ని చిత్రాలకు రచన చేశారు త్రివిక్రమ్. తరువాత ‘స్వయంవరం’ చిత్రం కోసం దర్శకుడు కె.విజయభాస్కర్ తో జోడీ కట్టారు. ఆ సినిమా విజయం తరువాత త్రివిక్రమ్, విజయభాస్కర్ జంట భలేగా నవ్వుల పంటలు పండించింది.
Also Read
‘నువ్వే నువ్వే’ చిత్రంతో తొలిసారి డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ ఇప్పటి దాకా పదకొండు చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘నువ్వే నువ్వే’ ఓ మోస్తరుగా విజయం సాధించింది. ‘ఖలేజా, అజ్ఞాతవాసి’ కంగారు పెట్టాయి. కానీ, బుల్లితెరపై కవ్వించాయి. మిగిలిన ఎనిమిది చిత్రాలూ జనాన్ని విశేషంగా అలరించాయనే చెప్పాలి. త్రివిక్రమ్, మహేశ్ తో తెరకెక్కించిన తొలి చిత్రం ‘అతడు’ హైదరాబాద్ లో రజతోత్సవం చూసింది. ఈ సినిమా థియేటర్లలో కన్నా మిన్నగా బుల్లితెరపై మురిపించింది. తరువాత ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలతో పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్స్ అందించారు. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తీసి ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ తో వరుసగా ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల…వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో నవ్వుల పువ్వులు పూయించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’ ప్రస్తుతానికి టాలీవుడ్ లో విడులైన చివరి బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. నితిన్ కు ‘అ ఆ’తో ఎంతో ఊరట కలిగించారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు త్రివిక్రమ్.
మాటతోనే మంత్రం వేసిన త్రివిక్రమ్ ‘ఒకరాజు-ఒకరాణి’ చిత్రంలో పాటలూ పలికించారు. ఎందుకనో గీతరచనను అటకెక్కించేసి, మాటలతోనే సాగుతున్నారు. తాను దర్శకునిగా సక్సెస్ సాధించిన తరువాత కూడా త్రివిక్రమ్ మాటలు రాయడం మానలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో రానున్న ‘భీమ్లా నాయక్’ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాశారు. త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రానుంది. త్రివిక్రమ్ ప్రతిభకు పట్టం కడుతూ 2015 సంవత్సరం బి.యన్.రెడ్డి జాతీయ అవార్డును ఆయనకు ప్రకటించారు. రాబోయే చిత్రాలతో త్రివిక్రమ్ తన మాటతోనూ, తీతతోనూ మరింతగా మురిపిస్తారని ఆయనను అభిమానించేవారు ఆశిస్తున్నారు. వారి అభిలాష నెరవేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!