కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ప్రదర్శిస్తామని చెప్పారు. కానీ కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రం ఈ సినిమా రేట్లు కూడా కొంత పెంచి అమ్మినట్టు తెలుస్తోంది.
అయితే… అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రాన్ని తెలంగాణలో సింగిల్ థియేటర్లలో రూ. 150కు, మల్టీప్లెక్స్ లో రూ. 195కు, ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ థియేటర్లలో రూ. 147కు, మల్టీప్లెక్స్ లలో రూ. 177కు జీఎస్టీతో కలిపి విక్రయించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర కథానాయకుడు అడివి శేష్ ట్వీట్ చేశాడు. ‘ఇది మన సినిమా. అందుకే కరోనా అనంతరం ఏ సినిమాకూ వర్తించని అతి తక్కువ టిక్కెట్ రేటుకు చూపించబోతున్నాం’ అని అడివి శేష్ అందులో పేర్కొన్నాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ‘మేజర్’ మూవీ జూన్ 3వ తేదీ తెలుగుతో పాటు హిందీ, మలయాళంలోనూ విడుదల కాబోతోంది.
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022