Ticket price hike: Involvement of heroes is not correct: Aswani Dutt
టిక్కెట్ రేట్ల విషయంలో హీరోలు ఇన్ వాల్వ్ కాకుండా ఉంటే బాగుండేదని, అది ట్రేడ్ బాడీస్ చేయాల్సిన పని అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. చిరంజీవితో పాటు కొందరు హీరోలు పనికట్టుకుని సీఎం ను కలిసి, టిక్కెట్ రేట్లను పెంచాల్సిందిగా కోరారని, దాంతో కోట్లు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టే, టిక్కెట్ రేట్లను వారు పెంచమంటున్నారనే భావన సాధారణ ప్రేక్షకుడికి కలిగిందని, నిజానికి టిక్కెట్ రేట్ల వ్యవహారం నిర్మాతలు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధించిందని, వ్యక్తి గత హోదాలో కొందరు సీఎం ను కలవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. అలానే ఇప్పుడు రకరకాల కారణంగా బంద్ చేయాలనుకోవడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. హీరోల రెమ్యూనరేషన్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచేసిన వారే ఇవాళ షూటింగ్స్ బంద్ చేయాలని అనుకుంటున్నారని, అది కరెక్ట్ కాదని చెప్పారు. కొందరు నిర్మాతలకు అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందని, షూటింగ్స్ ఆపడం మరిన్ని అనర్థాలకు దారిస్తుందని చెప్పారు. తాను ఆ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉండటం వల్ల సినిమాలు చేయలేదు, తిరిగి నాగ్ అశ్విన్ కారణంగా చిత్ర నిర్మాణంలోకి వచ్చానని అన్నారు.
తమ బ్యానర్ నుండి వచ్చిన ‘జాతి రత్నాలు’ సినిమా విషయం గురించి చెబుతూ, ”థియేటర్లకు జనం రాకపోవడం వల్ల దానిని ఓటీటీలో విడుదల చేయాలని మొదట నేను అనుకున్నాను. అయితే నాగ అశ్విన్ అందుకు అంగీకరించలేదు. అది థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని నన్ను ఒప్పించాడు. అదే ఆ తర్వాత మంచిదయ్యింది. ఆ సినిమా బాగా ఆడింది. అయితే… ఇవాళ నిర్మాతలు కొందరు బిలో ఏవరేజ్ సినిమాలను వెంటనే ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టేసి, ఎక్కువ డబ్బులు ఓటీటీ సంస్థల నుండి డిమాండ్ చేసి తమ చిత్రాలను పది, పన్నెండు రోజులకూ వేసేస్తున్నారు. ఆ డబ్బులను లాస్ వచ్చిన ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల థియేటర్లలో సినిమా చూడకపోయినా నష్టం లేదని, రెండు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుందనే భావనకు జనం వచ్చేశారు. కొందరు నిర్మాతలు చేసిన ఇలాంటి పనుల వల్లే థియేటర్లకు జనం రావడం తగ్గింది” అని చెప్పారు.