కరోనా కారణంగా రెండేళ్ళ పాటు ఇండస్ట్రీ అల్లకల్లోలం అయిపోయింది కానీ ఇప్పుడు పెద్ద, చిన్న సినిమాల షూటింగ్స్ తో అందరినీ యమా బిజీ చేసేసింది! జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చిరంజీవి మొదలుకొని కుర్ర హీరోల వరకూ అందరూ నాలుగైదు సినిమాలు చేస్తుండటం విశేషం. కాస్తంత గుర్తింపు ఉన్న ఏ హీరో జాబితా చూసినా రెండు సినిమాలకు మించి వారు కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవల త్రిగుణ్ గా పేరు మార్చుకున్న అదిత్ అరుణ్ జాబితా అయితే అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తోంది. బుధవారం త్రిగుణ్ బర్త్ డే! ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి రామ్ గోపాల్ వర్మ అతని బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశాడు. పలువురు యంగ్ హీరోస్ తో పాటు దర్శకులూ ఈ పార్టీకి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను త్రిగుణ్ ట్వీట్ చేశాడు.


ఇదిలా ఉంటే ఇటీవల త్రిగుణ్ నటించిన సినిమాలు ఓటీటీలో, థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్కటీ హిట్ అయిన దాఖలాలు లేవు. బట్… బర్త్ డే సందర్భంగా అతనితో మూవీస్ తీస్తున్న ప్రొడక్షన్ హౌసెస్ విడుదల చేసిన పోస్టర్స్ ను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. త్రిగుణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. దీనికి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. ఇది కాకుండా త్రిగుణ్ మరో ఐదారు సినిమాలలో నటిస్తున్నాడు. తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ ‘లైన్ మ్యాన్’ లో చేస్తున్నాడు. వి. రఘు శాస్త్రి దర్శకత్వంలో పర్పుల్ రాక్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని నిర్మిస్తోంది. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘కిరాయి’, ‘ప్రేమదేశం’, ‘గంజామ్’ చిత్రాలలోనూ త్రిగుణ్ హీరోగా నటిస్తున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ లతోనూ త్రిగుణ్ క్షణం తీరిక లేకుండా ఉన్నాడన్నది వాస్తవం! సో… టాలెంట్ ఉండాలే కానీ సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి!!