2022 Last Weekend: రెండేళ్ళు కరోనా కారణంగా భయం భయంగా థియేటర్లకు వచ్చిన జనాలు… ఈ యేడాది కూడా అదే భయంలో గడిపేశారు. అయితే తమకు నచ్చిన సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి జంకూ లేకుండా సదరు చిత్రాలను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేశారు. చిత్రం ఏమంటే… ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఓ పక్క నిర్మాతలు కూనిరాగాలు తీస్తూనే… మరో పక్క అత్యధిక సంఖ్యలో సినిమాలను రిలీజ్ చేశారు. ఈ యేడాది అనువాద చిత్రాలతో కలిసి మొత్తం 325 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఓటీటీ సినిమాలను పక్కన పెట్టినా… దాదాపు 300 చిత్రాలు డైరెక్ట్ గా థియేటర్లకు వచ్చినట్టే! ఇదిలా ఉంటే… ఈ యేడాదిలో అత్యధిక చిత్రాలు డిసెంబర్ లోనూ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే 19 స్ట్రయిట్, 10 డబ్బింగ్ సినిమాలు విడుదల కాగా… ఈ లాస్ట్ వీకెండ్ లో ఎనిమిది స్ట్రయిట్, రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే మొత్తం మీద డిసెంబర్ మాసంలో 39 సినిమాలు వస్తున్నాయన్నమాట.
గత వారం ’18 పేజీస్’తో ప్రేక్షకులను అలరించిన అనుపమా పరమేశ్వరన్ నటించిన ‘బట్టర్ ఫ్లై’ మూవీ 29న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 30వ తేదీ ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు నందమూరి తారకరత్న ‘ఎస్ -5’, సోహెల్ ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటితో పాటే ‘రాజయోగం, ఉత్తమ విలన్, నువ్వే నా ప్రాణం’ రిలీజ్ అవుతున్నాయి. ఐశ్వర్య రాజేశ్ నటించిన తమిళ చిత్రం ‘డ్రైవర్ జమున’ తెలుగు వర్షన్ కూడా 30న వస్తోంది. ఇక ఆ మర్నాడు ఆనంద్ రవి నటించిన ‘కొరమీను’తో పాటు, వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ చిత్రం ‘ఛేజింగ్’ తెలుగులో రిలీజ్ కానుంది. సో… 2022 సంవత్సరాంతం పది సినిమాలతో వీడ్కోలు చెప్పబోతోంది. అన్నట్టు… ఈ సినిమాల విడుదల ఒక ఎత్తుకాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు స్టార్ డమ్ తీసుకొచ్చిన ‘ఖుషి’ సినిమాను నిర్మాత ఎ.ఎం. రత్నం రీ-రిలీజ్ చేస్తుండటం మరో ఎత్తు. ‘భీమ్లా నాయక్’తో పెద్దంత సంతృప్తి చెందని పవన్ అభిమానులకు ‘ఖుషీ’… ఖుషీని కలిగించే ఆస్కారం మెండుగా ఉంది.