తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్న రామ్ గోపాల్ వర్మ రెండో చిత్రం ‘క్షణక్షణం’తోనూ మురిపించారు. ఈ రెండు చిత్రాలలో గ్యాంగ్ వార్స్ ను ఆకట్టుకొనేలా తెరకెక్కించారు రాము. మూడో చిత్రం ‘అంతం’ను కూడా అదే పంథాలో పయనింప చేశారు. అందునా తన తొలి హీరో నాగార్జునతో తెరకెక్కించిన చిత్రం కాబట్టి ‘అంతం’ కు ఆరంభం నుంచీ ప్రేక్షకుల్లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. ‘శివ’లాగే ఈ సినిమానూ హిందీలో రూపొందించారు రాము. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన రెండో సినిమాగా ‘అంతం’ 1992 సెప్టెంబర్ 11న జనం ముందు నిలచింది.
‘అంతం’ కథ ఏమిటంటే – అనాథ అయిన రాఘవ్ కాంట్రాక్ట్ కిల్లర్ గా సంపాదిస్తూ ఉంటాడు. అతను ఉండే నగరంలో శంకర్ నారాయణ్, జె.పి.శెట్టి అనే ఇద్దరి గ్యాంగ్స్ మధ్య వార్ సాగుతూ ఉంటుంది. రాఘవ్ ను శెట్టి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అతను చెప్పిన వారిని రాఘవ్ చంపేస్తుంటాడు. అలా చనిపోయిన వారి కేసును పరిశోధించడానికి ఇన్ స్పెక్టర్ కృష్ణను నియమిస్తుంది ప్రభుత్వం. ఆ నగరమేయర్ ను కూడా రాఘవ్ చంపేస్తాడు. కొంతకాలం రాఘవ్ ను అండర్ గ్రౌండ్ లో ఉండమని శెట్టి చెబుతాడు. రాఘవ్ దూరంగా పచ్చని అందాలు ఉండే ప్రదేశానికి వెళతాడు. అక్కడ అతనికి ఆర్నిథాలజీ (పక్షులపై అధ్యయనం) స్టూడెంట్ భావన పరిచయం అవుతుంది. ఎప్పుడూ ముభావంగా ఉండే రాఘవ్ కు భావన పరిచయం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆమె అంటే అతనికి ఆకర్షణ, అభిమానం కలుగుతుంది. రాఘవ్ కోసం వెదుకుతున్న ఇన్ స్పెక్టర్ కృష్ణకు భావన చెల్లెలు. రాఘవ్ , భావనకు శేఖర్ అనే పేరుతో పరిచయం అయి ఉంటాడు. తనకు అతను అబద్ధం చెప్పాడని భావనకు తెలుస్తుంది. రాఘవ్, భావన మధ్య ప్రేమ విషయం శెట్టికి తెలుస్తుంది. ఆమె అన్నను, రాఘవ్ ను కంట్రోల్ చేయడానికి శెట్టి, భావనను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను విడిపించే ప్రయత్నంలో శెట్టి, రాఘవ్ ను కాలుస్తాడు. కృష్ణ చేతిలో శెట్టి చస్తాడు. నెత్తురు ఓడుతూ రాఘవ్, భావన దగ్గరకు వెళ్ళి, తన ప్రేమ గురించి చెబుతాడు. అదే సమయంలో రాఘవ్ ను కృష్ణ కాలుస్తాడు. భావన ఒడిలోనే రాఘవ్ ప్రాణాలు పోతాయి. ఆమె ఏడుస్తూ ఉండగా కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఊర్మిళ మటోద్కర్ నాయికగా నటించగా, మిగిలిన పాత్రల్లో డేనీ, సలీమ్ గౌస్, ఆకాశ్ ఖురానా, రాళ్ళపల్లి, ఈశ్వరరావు, గోకిన రామారావు, నర్రా వెంకటేశ్వరరావు, హార్స్ మన్ బాబు, జలీల్, సిల్క్ స్మిత, డబ్బింగ్ జానకి కనిపించారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ రచన, దర్శకత్వం నిర్వహించారు. సీతారామశాస్త్రి అన్ని పాటలూ రాశారు. “చలెక్కి ఉందనుకో…” అంటూ సాగే పాటకు మణిశర్మ, “గుండెల్లో దడ దడ…” అంటూ మొదలయ్యే పాటకు కీరవాణి బాణీలు కట్టగా, మిగిలిన – “ఓ మైనా…”, “నీ నవ్వు చెప్పింది…” , “ఎంత సేపైన…”, “ఊహలేవో రేగే…” అంటూ సాగే గీతాలు ఆర్.డి. బర్మన్ సంగీతంతో అలరించాయి. నేపథ్య సంగీతాన్ని మణిశర్మ సమకూర్చారు. ఈ చిత్రానికి బోనీ కపూర్ సమర్పకుడు కాగా, కె.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.
‘అంతం’ హిందీలో ‘ద్రోహి’ పేరుతో 1992 అక్టోబర్ 23న విడుదలయింది. అయితే ‘శివ’ స్థాయిలో రెండు చోట్ల ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా ఓపెనింగ్ అయిన సమయంలో నాగార్జున, రామ్ గోపాల్ వర్మల ‘అంతం’ ఆరంభం! అంటూ ఓ సినిమా వీక్లిలో ఐటమ్ వచ్చింది. సినిమా షూటింగ్ ఆరంభం అనే ఉద్దేశంతో అలా మకుటం రాసినా, దానిపై అక్కినేని అభిమానులు గొడవ చేయడం, దానికి ఏయన్నార్ సైతం సీరియస్ కావడం, తరువాత ఆ పత్రికవారు విచారం వ్యక్తం చేయడం సాగాయి. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం శ్రీలంకలో చిత్రీకరణ జరుపుకుంది.
‘అంతం’ కథను లోతుగా చూస్తే ‘అతడు’ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగే రామ్ గోపాల్ వర్మనే తెరకెక్కించిన ‘సత్య’లోనూ కొన్ని సీన్స్ గుర్తుకు రాక మానవు. ఈ రెండు చిత్రాలకంటే ముందే ‘అంతం’ వచ్చిన సంగతి మరువరాదు.