ప్రపంచ సినిమా చరిత్ర లో ‘ది టెన్ కమాండ్మెంట్స్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అది ఒక విజువల్ వండర్. ఎర్ర సముద్రం ను రెండుగా చీల్చిన మోషే కథ ఇప్పటికీ కన్నులపండగే. దేవుని పై నమ్మకం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండితెర మీద నూతన సంవత్సర కానుకగా రానుంది. 1956లో సెసిల్ బి డెమిల్లే 220 నిమిషాల నిడివితో ‘ది టెన్ కమాండ్‌మెంట్స్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇండియాలో కూడా కొన్ని నగరాలలో 50 వారాలకు పైగా ప్రదర్శితమైన చిత్రమిది. 65 సంవత్సరాల తర్వాత దీనిని రీమేక్ చేశారు. ఇందులో డౌగ్రే స్కాట్ మోసెస్ పాత్రలో నటించారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 31న నూతన సంవత్సర కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీనిని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో యువరాణి బిథియాగా పద్మా లక్ష్మి నటించటం విశేషం. రాబర్ట్ డోర్న్‌హెల్మ్ తో కలసి జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేసన్ కామియోలో, రాండీ ఎడెల్‌మాన్ సంగీతాన్ని అందించగా… ఎడ్వర్డ్ జె పేయ్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.