ANR – Krishna: ‘తాను యన్టీఆర్ అభిమానే అయినా, నటునిగా మారడానికి కారణం మాత్రం ఏయన్నార్’ అని కృష్ణ పలు మార్లు చెప్పారు. ఎలాగంటే, కృష్ణ చదువుకొనే రోజుల్లో ఆయన చూసిన మొట్టమొదటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఏలూరు కళాశాల వార్షికోత్సవంలో ఏయన్నార్ చూసిన తరువాత నుంచీ కృష్ణలో తానూ సినిమా రంగంలో రాణించాలన్న అభిలాష పెరిగింది. ఆ తలంపుతోనే బి.యస్సీ., చదువుకు స్వస్తి పలికి, సినిమాల్లో వేషాల వేట ఆరంభించారు కృష్ణ. చిత్రంగా ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘కులగోత్రాలు’లోనే కృష్ణ తొలిసారి వెండితెరపై తళుక్కుమన్నారు. ఆ సినిమాలో నటించాక కృష్ణలోనూ ఆత్మస్థైర్యం పెరిగింది. అలా ముందుకు సాగారు, ‘నటశేఖరుని’గా జనం మదిలో నిలిచారు.
ఏయన్నార్ హీరోగా రూపొందిన “మంచి కుటుంబం, అక్కాచెల్లెలు” చిత్రాల్లో కృష్ణ సైడ్ హీరోగా నటించారు. తరువాత కృష్ణ సైతం స్టార్ హీరో అనిపించుకున్నాక, ఏయన్నార్ తో కలసి “హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం” వంటి సినిమాల్లో అభినయించారు. ఏయన్నార్ కు ‘దేవదాసు’ చిత్రం ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. తొలినుంచీ ఏయన్నార్ ను చూసి స్ఫూర్తి చెందిన కృష్ణకు ‘దేవదాసు’ పాత్ర తానూ పోషించాలన్న అభిలాష కలిగింది. 1974లో తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో ‘దేవదాసు’గా సినిమాస్కోప్ ఈస్ట్ మన్ కలర్ లో కృష్ణ నటించారు. అయితే ఆ సినిమా పరాజయం పాలయింది. అదే సమయంలో ఏయన్నార్ నటించిన 1953 నాటి ‘దేవదాసు’ను విడుదల చేయగా, మ్యాట్నీ షో తో హైదరాబాద్ లో 200 రోజులకు పైగా ప్రదర్శితమయింది. అప్పట్లో కొందరు యన్టీఆర్, ఏయన్నార్ కు పోటీగా కృష్ణ పోతున్నాడు, దెబ్బతింటాడనీ కామెంట్స్ చేశారు. అయితే తన సీనియర్స్ ఇద్దరినీ కృష్ణ ఎప్పుడూ గౌరవించేవారు. అది జరిగాకే ఏయన్నార్ తో కలసి కృష్ణ నాలుగు చిత్రాల్లో నటించడం విశేషం!
ఒకప్పుడు అక్కినేని హీరోగా నటించిన చిత్రాలలో కృష్ణ సైడ్ రోల్స్ లో నటిస్తే, తరువాత కృష్ణ నిర్మించిన చిత్రాల్లో ఏయన్నార్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఏయన్నార్ నటవారసుడు నాగార్జునతో కలసి కృష్ణ ‘వారసుడు’లో నటించారు. ఆ తరువాత ఏయన్నార్ అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘రాముడొచ్చాడు’లోనూ అతిథి పాత్రలో కనిపించారు కృష్ణ. మరో విశేషమేమిటంటే, అక్కినేని నటవంశంలో మూడోతరం హీరోగా నాగచైతన్య తొలి విజయం చూసింది ‘ఏ మాయ చేశావే’ చిత్రంతోనే. ఆ సినిమాకు కృష్ణ కూతురు మంజుల నిర్మాణ భాగస్వామి కావడం విశేషం!