Nikhil : ‘బింబిసార’, ‘సీతారామం’ సినిమాల సక్సెస్ తో చిత్రసీమ తిరిగి ఊపిరి పీల్చుకుంటోంది. ఇప్పుడు అదే బాటలో ‘కార్తికేయ -2’ సినిమా సక్సెస్ కావడంతో పరిశ్రమలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాతలు టి. ఎస్. విశ్వ ప్రసాద్, కె. ఎస్. వివేకానంద, అభిషేక్ అగర్వాల్, మయాంక్ సింఘానియా, తేజ్ నారాయణ్ అగర్వాల్, డైరెక్టర్ చందు మొండేటిని, నటీనటులను తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల అభినందించారు. ‘ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ కష్టకాలం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో ఈ సినిమాకు చక్కని విజయం లభించడం ఆనందించదగ్గ విషయమ’ని అన్నారు. మూవీ ప్రమోషన్ విషయంలో హీరో నిఖిల్ చూపిన ప్రత్యేక శ్రద్ధను అభినందిస్తామని, భవిషత్తులో మిగతా హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్ విషయంలో ఆ విధంగా సహకరించాలని నిర్మాతల మండలి అతన్ని ప్రత్యేక అభినందించింది. ప్రేక్షక ఆదరణ పొందుతున్న పాన్-ఇండియా సినిమా ‘కార్తికేయ-2’ నిర్మాతలకు, దర్శకుడికి, నటీనటులకు, చిత్ర యూనిట్ మెంబెర్స్ కు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని ఇలాంటి చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షను వ్యక్తపరిచింది.