కరోనా తరువాత ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అనగానే ఏ ఓటిటీలో వస్తుంది..? అనేస్తున్నారు. ఎంత మంచి సినిమా అయినా కానీ.. ఆ నెల పోతే ఓటిటీలోకి వచ్చేస్తుందిగా అప్పుడు చూద్దాంలే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటిటీ వచ్చాకా థియేటర్ కు వెళ్లి సినిమా చూసే వారి సంఖ్య తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓటిటీలో రావడం మంచిదే.. ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతోంది, డిజిటల్ రంగం ముందుకు దూసుకెళ్తోంది. కానీ, సినిమాను థియేటర్లో ఆస్వాదించే ఫీల్ ను ప్రేక్షకులు కోల్పోతున్నారు అనేది మేకర్స్ అభిప్రాయం.
ఒక సినిమాను ఏళ్లు, ఏళ్లు కష్టపడి లొకేషన్స్, గ్రాఫిక్స్, విజువల్స్, సౌండ్స్ అన్ని ప్రేక్షకులకు నచ్చేలా చేసి రిలీజ్ చేస్తే.. ఆ సినిమాను ఇంట్లో కూర్చొని ఆస్వాదిస్తాం అంటే మేకర్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో ఓటిటీపై నిర్మాతలు దండెత్తారు.. కష్టపడి నిర్మించిన సినిమాను నాలుగు వారాల్లో ఓటిటీలో చూడొచ్చు అనే ప్రేక్షకుల ధోరణి మారేలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకనుంచి ఒక సినిమా ఓటిటీలోకి రావాలంటే మినిమమ్ 50 రోజులు పడుతోందని నిర్మాతలు వెల్లడించారు. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల అవుతుందని, జూలై 1 నుంచి విడుదలయ్యే సినిమాలన్నీంటికీ నిబంధన వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో ఓటిటీ ప్రియులకు షాక్ తగిలినట్లే.. అయితే ఏది అన్ని సినిమాలకు వర్తిస్తుందా..? చిన్న సినిమాలకు , ప్లాప్ సినిమాల కోసం కూడా 50 రోజులు ఎదురుచూడాలా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయమై నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.