‘న్యాయ్ : ద జస్టిస్’ పేరుతో సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు దిలీప్ గులాటీ, సరళ, రాహుల్ శర్మ. అయితే, తమ కథ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుందని వారు ప్రకటించే సరికి లీగల్ బ్యాటిల్ మొదలైంది. ‘న్యాయ్’ విడుదల ఆపాలంటూ సుశాంత్ తండ్రి కోర్టుకు వెళ్లాడు. విచారించిన న్యాయ స్థానం గతంలోనే స్టేకు నిరాకరించింది. అయితే, తాజాగా సుశాంత్ తండ్రి తరుఫు న్యాయవాది చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఢిల్లీ హైకోర్ట్ ఇన్ జెక్షన్ ఆర్డర్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ‘న్యాయ్’ నిర్మాతలు తమ చిత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలిచ్చింది.
‘న్యాయ్’ సినిమా నిర్మాతలు సుశాంత్ మరణాన్ని తాము క్యాష్ చేసుకోవాలని చూడటం లేదంటున్నారు. నిజాయితీగానే దివంగత నటుడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నామని వారు చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే తమ సినిమా వెండితెరపై సాగుతుందని అంటున్నారు. థియేటర్లు తెరుచుకోగానే ‘న్యాయ్’ బాక్సాఫీస్ వద్దకొస్తుందని ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. ‘న్యాయ్’లో ప్రధాన పాత్రలో జుబేర్ ఖాన్ నటించగా, హీరోయిన్ గా శ్రేయా శుక్లా కనిపించనుంది. అస్రానీ, శక్తి కపూర్, సుధా చంద్రన్ లాంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో అలరిస్తారు. చూడాలి మరి, సుశాంత్ పేరు చెప్పుకుని బయలుదేరుతున్న ‘న్యాయ్’ చిత్రానికి ప్రేక్షకులు ఎంత వరకూ న్యాయం చేస్తారో!