అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థాంక్యూ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో మాళవిక నాయర్, అవికా గోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. నాగ చైతన్య మూడు దశల్లో ఉన్న జీవితాన్ని చూపించారు. “మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు” అంటూ చైతూ వాయిస్ తో మొదలైన ట్రైలర్ లో చైతూ స్కూల్, కాలేజ్, బిజినెస్ ఇలా మూడు దశల్లో ఎలా ఉన్నాడు అనేది చూపించారు. స్కూల్ లో ఉన్నప్పుడు మాళవిక నాయర్ తో ప్రేమ, కాలేజ్ లో ఉన్నప్పుడు చెల్లి అనుకున్న అమ్మాయి గురించి గొడవ.. బిజినెస్ లో ఒక యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన తీరు కనిపిస్తోంది.
ఇక ఇందులో అవికా గోర్, చైతన్యకు చెల్లిగా కనిపించడం విశేషం. ఇక రాశీ ఖన్నా, చైతూ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించింది. బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అందుకొనే క్రమంలో ప్రేమకు, ఎమోషన్ కు చోటు లేకుండా ఓ యారోగెంట్ గా ఎలా మారాడు ..? ఆలా మారడానికి కారణాలు ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీనేజ్ కుర్రాడిగా, కాలేజ్ స్టూడెంట్ గా, యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయాడు. చివర్లో “ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటె స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది” అనే డైలాగ్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. థమన్ మ్యూజిక్ ప్లజెంట్ గా అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు దర్శకుడు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.