కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘బీస్ట్’ను తొలిసారి భారతదేశంలో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (పీఎల్ఎఫ్) థియేటర్లలో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ తరహాలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ప్రీమియం లార్జ్ ఫార్మాట్’ ఆడిటోరియమ్స్ హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం ఇలాంటి పెద్ద థియేటర్లలో సినిమాలను చూడటం క్షేమదాయకమని ప్రేక్షకులు భావిస్తున్నారు. చైనా, అమెరికాల్లో కరోనా తర్వాత జనాలను థియేటర్లకు తీసుకొచ్చింది ఐమాక్స్, పీఎల్ఎఫ్ థియేటర్లే. అయితే జనాలను ఆకట్టుకునేందుకు ఆ సమయంలో టిక్కెట్ రేట్లను బాగా తగ్గించారు. దాంతో వాటి ఆక్యుపెన్సీ పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మూడు వేల స్క్రీన్స్ ఉంటే, అందులో పీఎల్ఎఫ్ థియేటర్లు కేవలం 6, 400 మాత్రమే ఉన్నాయి. కానీ గడిచిన ఆరేళ్ళలో ఈ థియేటర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం. కరోనా టైమ్ లో వీటి నిర్మాణం మందకొడిగా సాగినా, ఇప్పుడు తిరిగి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పీఎల్ఎఫ్ థియేటర్లపై మొగ్గు చూపుతున్నాయి. కంఫర్టబుల్ సిట్టింగ్, 15 మీటర్స్ కు మించిన లార్జ్ స్క్రీన్, హై డైనమిక్ రేంజ్ ఇమ్మెన్సివ్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పీఎల్ఎఫ్ థియేటర్ల ప్రత్యేకతలు. మరీ ముఖ్యంగా త్రీ డీ సినిమాను ఇందులో చూస్తే లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుందంటారు. ఇప్పుడు ‘బీస్ట్’ మూవీని ఈ ఫార్మెట్ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సో.. విజయ్ ఫ్యాన్స్ కు ఇది సూపర్ క్రేజీ న్యూసే!