ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం ఏమంటే… ఈ రెండు ఎపిసోడ్స్ కు గెస్ట్ గా గీత రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిర్యాల వచ్చారు. అంతే కాదు… ఆయన పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ను ఈ రెండు ఎపిసోడ్స్ లోనూ పాడి వ్యూవర్స్ లో సరికొత్త జోష్ నింపారు.
ఈ వీకెండ్ నుండి తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్స్ లో జడ్జెస్, మ్యూజిక్ బ్యాండ్ కు అదనంగా ఆడియెన్స్ కూడా చేరారు. లైవ్ లో సింగర్స్ పాడే పాటలను వారూ ఎంచక్కా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. అలానే షోకు గెస్టులనూ పిలవడం మొదలైంది. దాంతో ఇది నెక్ట్స్ లెవల్ కు చేరినట్టు ప్రారంభంలోనే అనిపించింది. ఇక ‘భీమ్లా నాయక్’ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన గీతాన్ని 12 మంది కంటెస్టెంట్స్ పాటడంతో ఎపిసోడ్ మొదలైంది. తర్వాత శ్రీరామచంద్ర జడ్జిలను ఉద్దేశించి కవిత్వం పేరుతో కపిత్వం వినిపించే ప్రయత్నం చేశాడు. అయితే దాన్ని తమన్ అడ్డుకున్నాడు. విశేషం ఏమంటే… తమన్ లోనూ మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. ఈ ఎపిసోడ్ మొత్తం పంచ్ డైలాగ్స్ వేస్తూ తమన్ ఆకట్టుకున్నాడు.
లాలస పాటతో ఈ ఎపిసోడ్ మొదలైంది. పాట అనంతరం శ్రీరామచంద్రకు ఆమెకు ఉన్న బంధుత్వం గురించి తమన్ అడిగి భంగపడ్డాడు. బోలెడు మెలికలు తిప్పుతూ తమ సంబంధాన్ని చెప్పి చివరకు శ్రీరామచంద్ర మావయ్య అవుతాడని తేల్చింది లాలస. ఆమె తర్వాత జయంత్ మాధుర్ ‘లై’ సినిమాలోని పాటను ఫుల్ జోష్ తో పాడాడు. అంతేకాదు… రజనీకాంత్ తరహాలో డైలాగ్ చెప్పి, ‘దేవుడా దేవుడా’ పాటకు స్టెప్పులూ వేశాడు. దాంతో జడ్జీలు ‘బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అంటూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీ శ్రావణి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోని తమన్నా స్పెషల్ సాంగ్ పాడి ఆకట్టుకుంది. ఇక రామ్ మిర్యాల ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకోగా, ఆ పాటకు తమన్ డ్రమ్స్ వాయించాడు. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘ఉప్పెన’లోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట అద్భుతంగా పాడటంతో కార్తీక్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. నిత్యా మీనన్ తన ప్రేమ గెలుచుకున్నావంటూ శ్రీనివాస్ ను అభినందించింది. ఇదే వేదికపైకి శ్రీనివాస్ తండ్రి, సోదరి వచ్చి, అతను పడిన కష్టాన్ని తెలియచేశారు. వైష్ణవి ‘స్వాతి కిరణం’లోని ‘సంగీత సాహిత్య సమలం కృతే’ పాటను వీనుల విందుగా పాడింది. ఆమె పాటకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెస్’ అని చెప్పేశారు. ఈ మధ్యలో ‘బాయ్స్’ సినిమా చూసిన దగ్గర నుండి తమన్, కార్తీక్ తనకు గురువులుగా మారిపోయారంటూ నవ్వుల పువ్వుల పూయించాడు. ఈ ఎపిసోడ్ చివరిలో జస్కరన్ ‘లెహరాయి’ పాట పాడాడు. అతని పెద్దనాన్న హోలీ రంగులు తీసుకుని వేదికపైకి రావడంతో అందరూ కలిసి హోలీ పండగ జరుపుకున్నారు.
శనివారం ఎపిసోడ్ సైతం సరదాగా సాగింది. వాగ్దేవి ‘సారంగదరియా… ‘ పాటతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె పాడే విధానం చూసి ముచ్చటపడిన కార్తీక్… వాగ్దేవికి తాను సినిమాలో పాట పాడే అవకాశం ఇస్తానంటూ మాట ఇచ్చారు. ఆ రకంగా ఈ షోలో మొదట పాట పాడే ఛాన్స్ ను వాగ్దేవి దక్కించుకున్నట్టయ్యింది. రామ్ మిర్యాల కూడా వాగ్దేవి పాటను మెచ్చుకోవడంతో ఆయనలో కలిసి స్టేజ్ మీద మరో పాట పాడిందామె. అదితి భావరాజు ‘బాద్ షా’లోని కాజల్ స్పెషల్ సాంగ్ ‘పక్కా లోకల్’ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ప్రణతి ‘భీమ్లా నాయక్’లో చిత్ర పాడిన పాటను ఆలపించి అందరి మన్ననలూ పొందింది.
రికార్డ్ టైమ్ లో చిత్ర పాట రికార్డింగ్!
‘భీమ్లా నాయక్’ కోసం చిత్ర ఓ పాట పాడారు. దానికి సంబంధించిన విశేషాలను తమన్ ఈ వేదికపై పంచుకున్నారు. చిత్ర గారు హైదరాబాద్ వచ్చి, శానిటైజ్ చేసుకుని పాట పాడటానికి ప్రిపేర్ కావడానికి దాదాపు 18 గంటల సమయం పట్టిందని, కానీ ఆమె పాటను కేవలం 18 నిమిషాలలో పాడేసి, తనను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారని తమన్ చెప్పాడు. ఆమె ఆ పాట పాడుతుంటే వీడియో షూట్ చేయడానికి మొదట మొహమాట పడ్డారని, కానీ మీలానే నేనూ లావుగా ఉంటాను కాబట్టి వేరే ఆలోచన చేయకండీ అని చెప్పానని తమన్ అన్నారు. గతంలో శ్రేయా ఘోషల్ పాడిన పాటను రికార్డ్ చేయడానికి 21 నిమిషాలు పట్టిందని, ఆ రికార్డ్ ను చిత్ర గారు చెరిపేశారని తమన్ అన్నాడు. తెర మీద ఈ పాటను అభినయించేది నిత్యా మీనన్ అని తెలుసుకుని, ఆమెకు తాను పాడితే బాగుంటుందా? అని చిత్ర గారు సందేహం వ్యక్తం చేశారని తమన్ తెలిపాడు. అయితే ఇది నేపథ్యంలో వచ్చే గీతమని, తాను ఒప్పించానని తమన్ అన్నారు. చిత్రం ఏమంటే… సినిమా నిడివిని తగ్గించే క్రమంలో ఈ పాటను చివరి నిమిషంలో ఎడిట్ చేశారు.
ప్రణతి తర్వాత రామ్ మిర్యాల మరోసారి వేదిక మీదకు వచ్చి లేటెస్ట్ మూవీ ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ పాడారు. ఆ తర్వాత మారుతి తన పాటతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతని బంధువులను వేదిక మీదకు తీసుకొచ్చి మారుతిని సర్ ప్రైజ్ చేశారు నిర్వాహకులు. ఇక తిరుపతికి చెందిన మాన్యా చంద్రన్ ‘వకీల్ సాబ్’లోని ‘మగువా… మగువా’ పాట పాడింది. చివరగా రేణు కుమార్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ లైవ్ కన్సెర్ట్ ను తలపిస్తూ పాడిన పాటకు ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అని ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఒకేసారి చెప్పేశారు. డైరెక్ట్ గా పాటలు పాడేయకుండా… ఇలాంటి షో కు వచ్చి వేరే వాళ్ళ ఛాన్స్ ఎందుకు నువ్వు పాడుచేస్తున్నావ్? అంటూ తమన్ రేణు కుమార్ కి తీయని హెచ్చరిక చేశాడు. ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్ లో వాగ్దేవి విన్ అయ్యి గిఫ్ట్ హ్యాంపర్ ను సొంతం చేసుకుంది. ఆ రకంగా ఈ వీకెండ్ లో 12 మంది కంటెస్టెంట్స్ చక్కని పెర్ఫార్మెన్సెస్ తో ఆకట్టుకున్నారు.